కేంద్ర బడ్జెట్ పై ఫిబ్రవరి 5 న దేశవ్యాప్తంగా జరుగు ఆందోళనలు జయప్రదం చేయండి
–ఏ ఐ టి యూ సి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్
విశాలాంధ్ర -అనంతపురం : కార్మిక చట్టాలు అమలు చేయాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ ప్రభుత్వాలని డిమాండ్ చేశారు, నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ లో సోమవారం ఏఐటియుసి జిల్లా సమితి సమావేశం జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది, ఈ సమావేశానికి రావులపల్లి రవీంద్రనాథ్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కార్మికుల సంక్షేమానికి నయాపైసా కేటాయించకుండా మోసం చేసిందన్నారు. ఇప్పటికే 44 కార్మిక చట్టాలను సవరణలు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు ద్రోహం చేసిందన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కార్మికులు,ఉద్యోగుల ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదన్నారు. అధికారంలోకి రాక మునుపు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని చెప్పి హామీలను అమలు చేయకుండా తుంగలో తొక్కారన్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చిన అన్ని బుట్ట దాఖలవుతున్నాయన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు పున ప్రారంభించి పెండింగ్లో ఉన్న క్లైములు వెంటనే ఇవ్వాలన్నారు, అసంఘటిత కార్మికులు హమాలి,ఆటో వీధివిక్రయదారులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ… కార్మికుల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తిన్నట్టు వ్యవరిస్తున్నాయన్నారు, రాష్ట్ర ప్రభుత్వం 12వ పిఆర్సి కమిటీని వెంటనే వేయాలన్నారు, కార్మికుల సమస్యలపై అవగాహన కోసం అనంతపురం జిల్లా స్థాయి శిక్షణా తరగతులు ఈనెల 22, 23, 24 తేదీలలో జరుపుకొని భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు, ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణుడు, జిల్లా ఉపాధ్యక్షులు గోవిందు, నాగవేణి, శ్రీనివాసులు, సహాయ కార్యదర్శులు చిరంజీవి,రాజు, శ్రీనివాసులు, జిల్లా సమితి సభ్యులు పాల్గొన్నారు.