బియ్యం ,నిత్యావసర సరుకులు పక్కదారి..!
విషయం బయటపడగానే మాట మార్చుతున్న పాఠశాల ప్రిన్సిపాల్
విశాలాంధ్ర – నార్పల:- మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థుల కోసం ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, నిత్యావసర సరుకుల వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. విద్యార్థులకు చేరాల్సిన సరుకులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ సరుకుల నిర్వహణలో పాఠశాల సిబ్బంది వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సరుకుల వ్యవహారం బయటపడటంతో అసలు విషయం బయటకు రాకుండా వివరణలు మార్చుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తొలుత ఒక రకంగా చెప్పి, విషయం తీవ్రత పెరగడంతో మరో రకంగా సమాధానం ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పాఠశాలలో ప్రభుత్వ సరుకుల నిర్వహణపై పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.విద్యార్థుల కడుపు నింపాల్సిన ప్రభుత్వ సరుకులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదని, దీనిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి స్టాక్ రిజిస్టర్లు, సరుకుల నిల్వలు, పంపిణీ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నిజానిజాలు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలు రుజువైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఈ ఘటనపై ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తీవ్రంగా స్పందించారు. గురుకుల పాఠశాలలో చోటుచేసుకున్న వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఉన్నతాధికారులను కోరారు. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, తప్పు చేసినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.విద్యార్థుల కోసం ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, నిత్యావసర సరుకులు, ఇతర సదుపాయాలు పూర్తిస్థాయిలో విద్యార్థులకే అందేలా అధికారులు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అవకతవకలకు ఎలాంటి తావు లేదని, విద్యార్థుల సంక్షేమం విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని పేర్కొన్నారు.గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం, అవసరమైన సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ సరుకుల విషయంలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకున్నా వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా అధికారులు వ్యవహరించాలని బండారు శ్రావణి శ్రీ కోరారు.


