రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాల సాధన కోసం భాగస్వామ్యం కావాలి
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ‘పిఫోర్’ కార్యక్రమం పురోగమించాలి
– కలెక్టర్ పి ప్రశాంతి
విశాలాంధ్ర – తూర్పుగోదావరి : ఆగస్టు 15 లోపు బంగారు కుటుంబాల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు.మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు దిశా నిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి పి 4 సర్వే పురోగతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, 2029 నాటికి పేదరిక నిర్మూలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పి.4 కార్యక్రమం ద్వారా సమాజంలోని ఆర్థిక అసమానతలను తగ్గించి, పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 66 వేల బంగారు కుటుంబాలను గుర్తించాల్సిన లక్ష్యం నిర్దేశించగా, ఇప్పటివరకు 60 వేల కుటుంబాలను గుర్తించామన్నారు. ఆయా కుటుంబాలను ఐదు వేల కుటుంబాలకు మార్గదర్శకులను మ్యాపింగ్ చేశామని తెలిపారు. మిగిలిన బంగారు కుటుంబాలను కూడా ఆగస్టు 15 లోపు గుర్తించి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ మేరకు బిఫోర్ “నీడ్ బేస్డ్” సర్వేను వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. బంగారు కుటుంబాలకు మార్గదర్శకుల సమన్వయంతో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతి 25 కుటుంబాలకు ఒక గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందిని నియమించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని, నెలలో మూడుసార్లు ముఖ్యమంత్రి స్వయంగా సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో మ్యాపింగ్ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, క్షేత్ర స్థాయిలో సిబ్బందికి తగిన మార్గదర్శకం చేయాలని సూచించారు. బొమ్మూరు లోని కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఇతర జిల్లా అధికారులతో కలిసి ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి టి. సీతారామమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డి, సీపీఓ ఎల్. అప్పలకొండ, జిల్లా బిసి సంక్షేమ అధికారి బి శశాంక, డిఎల్డీవో పి వీణా దేవి, ఏ. స్లీవా రెడ్డి, డి ఐ పి ఆర్వో కె. లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.


