రైతన్న మీ కోసం’ – తొర్రేడులో కరపత్రాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
*వరి సాగు లాభాలపై రైతులతో ముఖాముఖి – కలెక్టర్ కీర్తి చేకూరి*
*సేంద్రీయ ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన – పంట మార్పిడిపై దృష్టి సారించాలని సూచన*
విశాలాంధ్ర – రాజమహేంద్రవరం రూరల్ : గురువారం తొర్రేడు గ్రామంలో నిర్వహించిన ‘రైతన్న మీ కోసం’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కరపత్రాలను పంపిణీ చేసి, రైతులతో నేరుగా మాట్లాడారు. వరి సాగు వల్ల కలిగే లాభాలు, ఖర్చు – లాభాల నిష్పత్తి విషయాలను సమీక్షించారు. రబీ సీజన్లో ఎకరాకు సుమారు 20 వేల రూపాయల వరకు లాభం వస్తుందని, ఖరీఫ్‌లో పెట్టుబడి తిరిగి వస్తోందని రైతులు వివరించారు. ప్రస్తుతం ఎకరాకు 3–6 బస్తాల యూరియా వినియోగంలో ఉందని చెప్పిన రైతులకు, యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువుల సక్రమ వినియోగం అవసరమని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. సేంద్రియ వ్యవసాయం వైపు మారడం ద్వారా భూసారాన్ని పెంపొందించు కోవచ్చని, ఆరోగ్యకరమైన పంటలు సాగు చేయడం సాధ్యమవుతుందని కలెక్టర్ అన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కొత్త ఆవిష్కరణ లతో సాగు చేసి మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. పంట మార్పిడి విధానంలో హార్టికల్చర్ పంటల సాగును పరిశీలించాలన్నారు. మెరక భూములు ఉన్న ప్రాంతాల్లో ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేందుకు ముందడుగు వేయాలని రైతులకు సూచించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రైతులతో సమావేశంలో, వారిని వరి పంటతో పాటు ఉద్యాన, ఆరుతడి పంటలు పండించే విధానాలపై అవగాహన కల్పించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల వరి పంటకు వచ్చే ఆదాయం తగ్గవచ్చని తెలిపారు, అందువల్ల రైతులు ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. అదనంగా, రైతులు తమ ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా మాత్రమే విక్రయించాల్సిందని ఆమె ఆవహించారు. తదనంతరం కలెక్టర్ కీర్తి చేకూరి మిర్తిపాడు గ్రామంలో కళ్లల్లో నిలువ సమస్యలు, పంట ఎదుగుదల వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా అన్నదాత సుఖీ భవ – పీఎం కిసాన్ కింద అందుతున్న రూ.7 వేలు ఆర్థిక సాయంతో పంట పెట్టుబడికి తోడ్పడిందని రైతులు తెలిపారు. ఇటీవల మొంథా తుఫాన్ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో జరిగిన నష్టాలపై అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని కూడా రైతులు వివరించారు. కలెక్టర్‌తో పాటు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు, జిల్లా సహకార అధికారి ఎమ్. వెంకట రమణ, సహాయ సంచాలకులు రమేష్, రైతులు, స్థానిక అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


