Homeవిశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు

- Advertisement -

. ఉద్యోగులు, కార్మికుల తొలగింపులతో కుట్ర
. మొండిగా ముందుకెళుతున్న కేంద్రం
. తిప్పకొడతామన్న పోరాట కమిటీ

విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఉద్యోగులు, కార్మికుల తొలగింపు లతో ఈ కుట్రను అమలు చేస్తోంది. స్టీల్‌ప్లాంట్‌ను నూరు శాతం అమ్మాలని 2021 జనవరి 21 న నిర్ణయించింది. కానీ ఐదేళ్ల నుంచి నిరవధికంగా జరుగుతున్న పోరాట ఫలితంగానే నేటికీ విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఒక్క శాతం కూడా ప్రైవేటు పరం కాలేదు. కానీ స్టీల్ ప్లాంట్‌ను బలహీనపర్చి ప్రైవేటుకు కట్టబెట్టాలని కేంద్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను వేగం చేసింది. ఈ కుట్రలను రాష్ట్ర ప్రజలు, కార్మికవర్గం తీవ్రంగా వ్యతిరేకించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కోక్ ఓవెన్ ప్రథమ విభాగం 2021లో నిర్మించాల్సిన ఆరో బ్యాటరీని ఇంతవరకు నిర్మించలేదు. మిగిలిన ఐదు విభాగాల్లో నిర్వహణ సక్రమంగా లేక రోజుకు 420 పుస్సింగ్‌ల సామర్థ్యం ఉన్న కోకో ఓవెన్ బ్యాటరీలు బలహీనమై 280 పుస్సింగ్‌లకు ఉత్పత్తి పడిపోయింది. కోకో ఓవెన్ గ్యాస్ తగ్గడంతో మొత్తం మిల్స్‌లోని ఫర్నేస్‌లో ఉత్పత్తి 70 శాతానికి తగ్గింది. దీనివల్ల స్టీల్ రాడ్‌లు తయారుచేయలేక బిలెట్స్ రూపంలో అమ్మడం వల్ల సాలీనా రూ.1,500 కోట్లు స్టీల్‌ప్లాంట్ నష్టపోతున్నది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడంతో మార్కెట్‌లో ఇనుప ఖనిజం అత్యధిక ధరలకు కొనడంతో ముడి ఖనిజం కొనుగోలు వ్యయం 74 శాతానికి పెరిగింది. సెయిల్‌లో ముడిఖనిజం కొనుగోలు వ్యయం 48 శాతంగా ఉంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ అప్ప్పులపై వడ్డీ రేటు 10 శాతం చెల్లిస్తోంది. సెయిల్‌కు 3.4 శాతం వడ్డీ రేటుగా ఉంది. ఇవన్నీ ప్రభుత్వం కావాలని విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వేసిన భారాలు. సొంత గనులుంటే విశాఖ స్టీల్‌ప్లాంట్ దేశంలోనే నంబర్ వన్ స్టీల్‌ప్లాంట్‌గా ఉండేది. కానీ గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల సుమారు రూ.5 వేల కోట్ల నష్టం భరించింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ద్వారా ప్యాకేజీ ఇప్పించి… లాభాల్లోకి తీసుకువచ్చామన్న తప్ప్పుడు ప్రకటనను పోరాట కమిటీ తిప్పికొట్టింది. 2021 వరకు దేశంలోని స్టీల్ ఎగుమతుల్లో విశాఖ స్టీల్‌ప్లాంట్ అగ్రగామిగా ఉంది. ప్రతి సంవత్సరం విదేశాలకు ఎగుమతుల వల్ల డాలర్ల రూపంలో లాభాలు వచ్చేవి. కానీ కేంద్ర ప్రభుత్వం 2021 తరువాత ఎగుమతులు పూర్తిగా లేకుండా చేసింది. మరోవైపు, విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికవర్గంపై తీవ్రంగా దాడి కొనసా గుతోంది. పని చేస్తున్న వారిని పూర్తిగా నిరుత్సాహపర్చడం అనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కిందిస్థాయి నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వరకు నియామకాల విషయానికొస్తే… విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పని చేసే వారినే నియమిస్తారు. కానీ ఇటీవల ఇడి ఆపరేషన్‌ను ప్లాంట్‌లో వారిని కాకుండా సెయిల్ నుంచి సేన్ గుప్తాను నియమించారు. దీనివల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పర్మినెంట్ కార్మికుల నియామకాలు ఆరు సంవత్సరాల నుంచి లేవు. సుమారు 50 శాతం మంది ఉద్యోగాల నుంచి రిటైర్‌మెంట్, వీఆరఎస్ పేరుతో యాజమాన్యం బయటకు నెట్టివేసింది. ప్లాంట్‌లో ముగ్గురు కార్మికులు పని చేయాల్సిన మూడు యంత్రాలను ఒకే కార్మికుడు నడుపుతున్నాడు. అయినా బయోమెట్రిక్ పద్ధతితో ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా ఆబ్‌సెంట్ వేస్తున్నారు. అలాగే 6 వేల మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులను అక్రమ పద్ధతిలో తొలగించింది. నోటీసులు ఇవ్వకుండా, నష్ట పరిహారం చెల్లించకుండా బయోమెట్రిక్ నుంచి పేర్లు తొలగించి మెయిన్ గేట్ నుంచి పనుల్లోకి రాకుండా నిలిపివేశారు. మాట్లాడితే ఛార్జ్‌షీట్లు, వార్నింగ్ లెటర్లు ఇస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఎమర్జన్సీ వాతావరణం నెలకొంది. కార్మికవర్గం ఆర్థిక మూలాలను కేంద్ర ప్రభుత్వం కావాలని దెబ్బతీసింది. పొగపెట్టి పొమ్మన్నట్లుగా ఉన్న జీతాలు, హెచఆరఎ, బోనస్, ఇన్సెంటివ్, లీవ్ జీతాలు, లోన్లు గత ఐదేళ్ల నుంచి పూర్తిగా కార్మికులకు చెల్లించకుండా నిలిపివేసింది. అన్ని ప్రభుత్వ రంగాలకు వేతన ఒప్పందాలు జరిగినా… విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు 2017 జనవరి 1 నుంచి అమలుకావాల్సిన వేతన ఒప్పందం ఆగిపోయింది. దీనివల్ల పర్మినెంట్ కార్మికులు, ఆఫీసర్లు, కాంట్రాక్ట్ వర్కర్లు సగం జీతాలకే పని చేస్తున్నారు. ఇప్ప్పుడు పని చేస్తున్న కార్మికులు, ఆఫీసర్లను తొలగించి తక్కువ వేతనాలకు కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రైవేటు వారికి అప్పగించడానికే కేంద్ర ప్రభుత్వం ఈ కుట్ర అమలు చేస్తోంది. ప్రైవేటు యాజమాన్యాలకు లాభాలు రావాలంటే ఉన్న కార్మికులను తొలగించాలనే విధానానికి ఒడిగట్టింది. ప్రైవేటీకరణకు ముందు ఈ పద్ధతులన్నీ పథకం ప్రకారం అమలు చేస్తోంది. ఎన్ని ఇబ్బందులున్నా విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉత్పత్తి తగ్గకుండా కార్మికవర్గం తీవ్రంగా కషి చేస్తోంది. కానీ ఉత్పత్తి కంటే కార్మికులను తొలగించడమే ముఖ్యమని ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ఈ తప్ప్పుడు పద్ధతులు ఆపి కార్మిక హక్కులను అమలు చేయాలని పోరాట కమిటీ డిమాండ్ చేస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు