– ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
తనపై హత్యకు పాల్పడితే.. ఆ దేశాన్ని అమెరికా భూస్థాపితం చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై ఏదైనా హత్యాయత్నం జరిగి, దాని వెనక ఇరాన్ హస్తం ఉందని తేలితే.. ఆ దేశాన్ని తుడిచిపెట్టేయాలని తన సలహాదారులను ఆదేశించినట్లు ట్రంప్ ఇప్పటికే ఓసారి వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి అదేతరహా హెచ్చరికలు చేశారు. కాగా.. డిసెంబర్ నుంచి పాలకులకు వ్యతిరేకంగా ఇరాన్ ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. దీంతో తమ దేశంలో నెలకొన్న ఆందోళనలకు అమెరికా అధ్యక్షుడే కారణమని ఆయతుల్లా అలీ ఖమేనీ ఆరోపించగా.. ఇరాన్లో కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని ఆ నిరసనకారులకు ట్రంప్ మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఖమేనీ పాలన అంతం కావాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ నాయకుడే లక్ష్యంగా ఏదైనా దురాక్రమణ జరిగితే.. దానిని తాము దీటుగా ఎదుర్కొంటామని హెచ్చరించింది.


