జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి
విశాలాంధ్ర – ఏలూరు : ఏలూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటుతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్దఎత్తున ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ . చంద్రబాబునాయుడుకు తెలియజేసారు. రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు గురువారం ఏలూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటులో భాగంగా సెర్ప్ సహాయంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధానమంత్రి జన్ మన్ కార్యక్రమంలో భాగంగా పోలవరం నియోజకవర్గంలోని పాపికొండల గిరిజన ప్రాంతాలలో పేద గిరిజనులకు ఇళ్ళు మంజూరయ్యాయని, అభయారణ్య పరిధి అని అటవీ శాఖ వారు ఇళ్ల నిర్మాణానికి, కనీసం త్రాగునీరు అందించేందుకు కూడా అనుమతి మంజూరు చేయడం లేదన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ పారిశ్రామిక, పర్యాటక రంగాలలో అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు.ఏలూరు జిల్లాలో భూముల ధరలు ఎక్కువగా ఉన్నందున పరిశ్రమలకు ల్యాండ్ పూలింగ్ విధానంలో భూసేకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా కోకో సిటీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని,అవసరమైతే పిపిపి విధానంలో భూసేకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పారిశ్రామికవాడలు ఏర్పాటుకు భూ సేకరణకు భూములను గుర్తించాలన్నారు. గిరిజన ప్రాంతాలలో ప్రధానమంత్రి జన్ మన్ కార్యక్రమంలో ఇళ్ళు నిర్మాణాలకు, రోడ్లు, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అటవీ శాఖ, జిల్లా యంత్రాంగం కలిసి చర్చించి చర్యలు తీసుకోవాలన్నారు.


