ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అనంతపురము జిల్లా శాఖకు నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సభ్యులు
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అనంతపురము జిల్లా శాఖ పాలకసమితి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, నూతన కార్యవర్గ ఎన్నికలు మరియు వార్షిక సర్వసభ్య సమావేశం ఈ ఏడాది ఏప్రిల్ 29న కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఎన్నికల అధికారి జి. రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించబడింది.నూతన కార్యవర్గంలో సభ్యులుగా ఎన్నిక కావడానికి నాలుగు ప్యానెల్‌ల నుంచి మొత్తం 44 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సేవా సంస్థ అయిన రెడ్ క్రాస్‌లో సేవాభావానికే ప్రాధాన్యం ఉండాలని, ఎన్నికలు వివాదాలకు దారితీయకుండా ఏకాభిప్రాయంతో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ శాఖతో పాటు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు ఓ. ఆనంద్, సూచించారు. ఈ మేరకు అన్ని ప్యానెల్‌ల ప్రతినిధులతో రెండు దఫాలుగా సమావేశాలు నిర్వహించి, పరస్పర అవగాహనతో 11 మంది సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. అనంతరం సభ్యులలో ముగ్గురిని చైర్మన్, వైస్ చైర్మన్, ట్రెజరర్‌లుగా ఎన్నుకొని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, ఐ.ఏ.ఎస్. అధికారికంగా ధృవీకరించారు. నూతన కార్యవర్గంలో డా. గజ్జల లక్ష్మణ ప్రసాద్ చైర్మన్‌గా, ప్రొఫెసర్ డా. గీతా బాల వైస్ చైర్మన్‌గా, సుంకర రమేష్ ట్రెజరర్‌గా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా డా. కె. లక్ష్మీనారాయణ, ఎం.జి. ఎరన్న, డా. ఓ. మనోరంజన్ రెడ్డి, ఆలంబన జనార్ధన్, భిసతి భరత్, దాసరి భరత్ కుమార్, వి.కె. శ్రీవాణి మరియు విష్ణుప్రియ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులు బుధవారం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు ఓ. ఆనంద్, వారి ఛాంబర్ నందు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నూతన కార్యవర్గాన్ని అభినందిస్తూ, వైద్య, విద్య, వ్యాపార, సామాజిక సేవ తదితర విభిన్న రంగాలకు చెందిన అనుభవజ్ఞులు ఒకే వేదికపై కలసి సమర్థవంతమైన కార్యవర్గంగా ఏర్పడటం అభినందనీయమని పేర్కొన్నారు. సభ్యులందరూ సమిష్టి భావంతో పనిచేస్తూ రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని సూచించారు.
అదేవిధంగా, ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న ఁచేయూతఁ ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచిస్తూ, వీలు చూసుకుని త్వరలోనే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అనంతపురము జిల్లా శాఖ కార్యాలయాన్ని సందర్శిస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, జిల్లా పరిపాలన అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రక్తదానం, ప్రథమ చికిత్స శిక్షణ, విపత్తు నిర్వహణ, ఆరోగ్య సేవలు, యువజన సేవా కార్యక్రమాలు, దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాలు మరియు ఇతర మానవతా సేవలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరవేసేందుకు సమిష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు.


