విధి నిర్వహణకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ప్రభుత్వం చర్య…
విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్‌పర్సన్ తలారి రాజ్‌కుమార్ ను పదవి నుండి తొలగిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విధి నిర్వహణకు విరుద్ధంగా ప్రవర్తించడం, చట్టబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించకపోవడం వంటి కారణాలతో ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి (జి) శాఖ జారీ చేసిన జి.ఓ.ఆర్.టి. నం.1194, తేదీ 29-10-2025 ప్రకారం చైర్‌పర్సన్‌గా రాజ్‌కుమార్ రెండు నెలల వ్యవధిలో రెండు కౌన్సిల్ సమావేశాలను జరపాల్సి ఉన్నా నిర్వహించలేదని, 2024 నవంబర్, డిసెంబర్ నెలల్లోను, 2025 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లోను కౌన్సిల్ సమావేశాలు జరగలేదని ప్రభుత్వం గుర్తించింది. కౌన్సిల్ సభ్యుల మూడో వంతు అభ్యర్థించిన ప్రత్యేక సమావేశాన్ని కూడా ఆయన ఏర్పాటు చేయలేదని ఉత్తర్వులో పేర్కొంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 22న ప్రభుత్వంచే షోకాజ్ నోటీసు జారీచేయగా, ఆయన 15 రోజుల్లో వివరణ ఇవ్వకపోవడంతో, అందుబాటులో ఉన్న ఆధారాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెక్షన్ 60(1) ప్రకారం ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని వినియోగించి, చైర్‌పర్సన్ రాజ్‌కుమార్‌ను పదవి నుండి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు.


