విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) :రాజాం పట్టణంలో తొలిసారిగా సంతాన సాఫల్య (ఐవీఎఫ్) కేంద్రం ప్రారంభమైంది. రాజాంలోని అమృత హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని మాజీ మంత్రి, రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం, వైద్య నిపుణులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోండ్రు మాట్లాడుతూ, ఇప్పటివరకు సంతాన సమస్యలతో బాధపడుతున్న దంపతులు చికిత్సల కోసం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని అన్నారు. ఇకపై రాజాంలోనే ఆధునిక సాంకేతికతతో కూడిన కృత్రిమ గర్భధారణ సేవలు అందుబాటులోకి రావడం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుందని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి ఇటువంటి ప్రత్యేక వైద్య సేవలు కీలకమని తెలిపారు.
అమృత హాస్పిటల్ సంతాన సాఫల్య కేంద్ర వైద్యుడు డాక్టర్ గార రవి ప్రసాద్ మాట్లాడుతూ, అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆధునిక టెక్నాలజీతో ఐవీఎఫ్ చికిత్సలు అందించనున్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడం తమ లక్ష్యమని అన్నారు.
ఈ ఐవీఎఫ్ కేంద్రం ప్రారంభంతో రాజాం పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాలు, సరిహద్దు జిల్లాల ప్రజలకు కూడా వైద్యపరంగా లబ్ధి చేకూరనుందని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆసుపత్రి యాజమాన్యం, స్థానికులు పాల్గొన్నారు.
అమృత హాస్పిటల్‌లో కృత్రిమ గర్భధారణ సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే కోండ్రు
- Advertisement -


