– బర్రే కొండబాబు
విశాలాంధ్ర – రాజమండ్రి సిటీ ; రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కొందరు వైద్యుల నిర్లక్ష్యానికి పేదలు బలవుతున్నారని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు ఆరోపించారు.పేద రోగులకు మెరుగైన చికిత్స అందించకుండా కొందరు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సుబ్బారావు నగర్ కు చెందిన జువ్వల రాజేష్ అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుండడంతో మంగళవారం అర్థరాత్రి అత్యవసరంగా అతడి కుటుంబ సభ్యులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్ళారని,తాను కూడా అక్కడకు వెళ్లి అతడికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని చెప్పి వచ్చానని తెలిపారు.తాను వచ్చేసిన తర్వాత గుండె పరీక్ష వైద్యుడు కనీసం రోగిని పరీక్షించకుండా మద్యం తాగడం వల్ల హార్ట్ ప్రోబ్లం వచ్చిందని, చికిత్స చేసేందుకు అక్కడ హార్టుకి సంబంధించి సరైన సదుపాయాలు లేవని కాకినాడ తీసుకు వెళ్ళాలని చెప్పాడన్నారు.అర్థరాత్రి అంతదూరం తాము ఎలా వెళతామని, అంబులెన్స్ ఏర్పాటు చేయాలని రోగి భార్య, బంధువులు వాపోవడంతో ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసి కనీసం నర్సింగ్ సిబ్బంది కూడా లేకుండా అంబులెన్స్ డ్రైవరుతో రోగి రాజేష్ ను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి పంపించాడని ఇలాగేనా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు ప్రవర్తించే తీరు అని ఆయన ప్రశ్నించారు.కాకినాడ ఆసుపత్రిలో వైద్యులు రాజేష్ ను పరీక్షించి రెండుసార్లు ఈసీజీ తీసి చూసి హర్టులో ఎలాంటి ప్రోబ్లం లేదని నిర్దారించి, నీరసంగా ఉన్న రోగికి ఇంజెక్షన్ చేసి సెలైన్ ఎక్కించి బుధవారం ఉదయం 6.30 కి ఇంటికి పంపించారని కొండబాబు వివరించారు.రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో కొందరు వైద్యుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని బర్రే కొండబాబు అన్నారు.ఇంటివద్ద ,బయట క్లినిక్ పెట్టుకుని ప్రైవేటు వైద్యం చేయడానికి రుచిమరిగిన కొందరు ప్రభుత్వ వైద్యులు ఆసుపత్రికి వచ్చే పేద రోగులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.కడుపులో ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్న రాజేష్ ను సరిగా పరీక్ష చేయకుండానే కాకినాడ ప్రభుత్వాసుపత్రికి పంపించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రాజమండ్రి సామాన్య సర్వజన ఆసుపత్రిలో సామాన్యులకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షయేనా అని బర్రే కొండబాబు ప్రశ్నించారు.ఆ వైద్యుడి తీరుపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.రోగి రాజేష్ భార్య జువ్వల సత్యవతి మాట్లాడుతూ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళిన తన భర్తను డాక్టర్ కనీసం ముట్టుకోలేదని ఎలాంటి పరీక్షలు చేయకుండా అక్కడ తమకు సదుపాయాలు లేవని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్ళాలని అర్థరాత్రి చెప్పారని వాపోయింది.అంబులెన్స్ లో డ్రైవరుమాత్రమే ఉన్నారని, నర్సు కూడా తోడు రాలేదన్నారు.కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించి గుండె నార్మల్ గానే ఉందని ఇంజెక్షన్ చేసి సెలైన్ ఎక్కించి ఇంటికి తీసుకువెళ్లమని చెప్పారని సత్యవతి చెప్పారు.రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో తమలాంటి పేదలకు వైద్య సేవలు అందించడంలో ఇలాంటి వైద్యులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం – రోగులకు ప్రాణ సంకటం
- Advertisement -
RELATED ARTICLES


