పారిశుద్ధ్య సమస్యను చక్క దిద్దుతారా..
రానున్న పుష్కరాలు ఆయనకు సవాలుగా మారనున్నాయా..?
విశాలాంధ్ర – కొవ్వూరు : అన్నీ ఉన్నాఅల్లుని నోట్లో శని అన్న చందాన కొవ్వూరు పట్టణ తీరు తయారయింది. ఈ నేపద్యంలో కొత్త కమిషనర్ గా వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. ఒకపక్క సానిటరీ ఇన్స్పెక్టర్ లేని లోటు, దానికి తోడు పర్యవేక్షణ కరువు అవడంతో సానిటేషన్ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. 30 సంవత్సరాలు మున్సిపాలిటీలలో వివిధ హోదాలలో అనుభవం ఉన్న వ్యక్తి కమిషనర్గా రావడంతో పట్టణ ప్రజలు అంచనాలు పెంచుకున్నారు. డిపార్ట్మెంట్ పరంగా ఆరు ట్రాక్టర్లు, మరో రెండు అద్దెట్రాక్టర్లు. నడుస్తున్నాయి. రెగ్యులర్, కాంట్రాక్టు సిబ్బంది తగినంత మంది ఉండగా కూడా పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కావడం లేదు. పట్టణంలో ప్రధాన కూ డళ్ళైన ఆర్డీవో కార్యాలయం, రైల్వే స్టేషన్, ఎల్ఐసి సెంటర్, విజయ విహార్ సెంటర్, బస్టాండ్ సెంటర్లలో కూడా ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. అలాగే డ్రైనలలో సైతం మురుగు నిలిచిపోతుంది. సానిటరీ వర్కర్లు ట్రాక్టర్ డ్రైవర్లు గాను, డ్రైవర్లు మేస్త్రిల గాను వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా జగన్ ప్రభుత్వంలో సచివాలయాల్లో పదిమంది సానిటరీ సెక్రటరీలుగా నియమితులయ్యారు. వీరు ఉదయం ఐదు గంటలకు రావాల్సి ఉండగా ఎనిమిది గంటలకు వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరి కొంతమంది 5:30 కి వేలిముద్ర వేసి ఇల్లకెళ్ళి తిరిగి 8 గంటలకు వస్తున్నట్లు సమాచారం. మున్సిపాలిటీకి నాలుగు పర్మినెంట్ ట్రాక్టర్లు, రెండు అద్దెకు నడుస్తున్నాయి. ఒక కాంపాక్ట్రు ఉన్నాయి. వీటి ఆయిల్ ఖర్చు కింద నెలకు లక్ష నుంచి లక్షన్నర వరకు ఖర్చవుతుంది. మున్సిపాలిటీకి సంబంధించి డంపింగ్ యార్డ్ లేకపోవడం గమనాహ్రంగా పేర్కొనవచ్చు. గతంలో డంపింగ్ యార్డ్ కు స్థలాన్ని మున్సిపాలిటీ కొనుగోలు చేసిన సంబంధిత రైతు కోర్టుకు వెళ్లడంతో అది కాస్త అడ్డం తిరిగింది. ఇక దోమల విషయానికొస్తే చెప్పనక్కర్లేదు. అలాగే వీధిలైట్లు పూర్తిస్థాయిలో వెలగడం లేదు. ఇటువంటి సమస్యలవలయంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో వచ్చే ఏడాది ఆగస్టు నెలలో గోదావరి కి పుష్కరాల వస్తున్నాయి. ఆ సమయానికైనాపరిస్థితులు చక్కబడతాయా లేదా అన్న ప్రశ్న ప్రజల్ని వెంటాడుతుంది. పుష్కరాల సమయంలో వివిధ రాష్ట్రాల నుంచి సైతం కొవ్వూరు గోదావరి స్నానాలకు వస్తుంటారు. భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మరోవైపు గోదావరి పుష్కరాలను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సమీక్షల మీద సమీక్షలు జరుగుతున్నాయి. నిధులకు సైతం కొరత ఉండదని ప్రభుత్వం చెబుతున్న నేపద్యంలో కొత్త కమిషనర్ సమస్యలను ఎలాగ అదుపులోకి తెస్తా రోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


