*భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ సూచనలు*
కలెక్టర్ పి. ప్రశాంతి
విశాలాంధ్ర – తూర్పుగోదావరి :
కలెక్టరేట్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రస్సల్ సిస్టమ్ (PGRS) పరిధిలో 108 ఫిర్యాదులు స్వీకరించబడ్డాయి. ప్రజల సమస్యల పరిష్కార దిశలో అధికారులు మరింత జవాబుదారీతనం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. పౌర సేవల విషయంలో ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుందని, అందుకు అనుగుణంగా నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమం లో మొత్తం 108 అర్జీలు స్వీకరించడం జరిగింది. వాటిలో రెవెన్యూ శాఖకు 42, పంచాయత్ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖకు 20, హోమ్ శాఖకు 16, మానవ వనరుల శాఖ (పాఠశాల విద్య)కు 6, విద్యుత్ శాఖకు 5, ఇతర శాఖలకు 24 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు.గ్రీవెన్స్ కార్యక్రమంలో పునరావృతమవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆమె పేర్కొన్నారు. నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించడంలో అధికారులు కృషి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.*అధిక వర్షాలు కురిసే అవకాశం దృష్ట్యా సూచనలు*రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. గోదావరి నదిలో వరదనీరు పెరగడం వల్ల ధవలేశ్వరం బ్యారేజీ నుంచి మంగళవారం 10 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేసి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బలహీన వంతెనలు, కల్వర్టులపై వాహన రాకపోకలను నిలిపి వేయాలన్నారు. శిథిలావస్థ లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలను పరిశీలించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామ/వార్డు సచివాలయా లలో మూడు రోజుల పాటు సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని, పంచాయతీ లలో పారిశుద్ధ్యాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని డిపిఒ ను ఆదేశించారు. అవసరమైన చోట్ల మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. ఇప్పటికే జిల్లా, డివిజన్, మండల స్థాయి కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొవ్వూరు మండలం మద్దూరు గ్రామ ప్రజలు తమ గ్రామానికి రోడ్డు కావాలని కోరుతూ అర్జీ పెట్టుకోవడం జరిగింది దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సంబంధిత పంచాయతీరాజ్ అధికారికి ఆదేశాలు జారీ చేశారు త్వరలో మీ రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని గ్రామస్తులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, డి.ఆర్వో టి. సీతారామ మూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు.


