— జరుగుతున్న ప్రమాదాలకు బాధ్యులెవరు?
విశాలాంధ్ర – కడియం : ఆగి ఉన్న వాహనాలను ఢీకొని ప్రమాదాలు జరిగిన సంఘటనలు తరచుగా వింటూ ఉన్నాం. కొన్నిసార్లు ఈ ప్రమాదాల వల్ల ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది. అయినప్పటికీ కొంతమంది వాహన డ్రైవర్లు తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. వాహనాలను రహదారి పక్కనే పార్క్ చేసి వదిలేస్తున్నారు. కడియం మండలం, కడియపులంక 216 వ నెంబరు జాతీయ రహదారికి ఇరువైపులా పలు వాహనాలు నిలపడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు నర్సరీరంగంలోనూ ఇటు పారిశ్రామికంగానూ అభివృద్ధి చెందుతున్న కడియం మండలంలో ప్రతిరోజు వందల సంఖ్యలో లారీల ఎగుమతులు మరియు దిగుమతులు జరుగుతూ ఉంటాయి. లారీ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీనితో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ట్రాన్స్ పోర్ట్ వాహనాలు ఎగుమతులు దిగుమతులు నిమిత్తం గంటల తరబడి, ఒక్కొక్కసారి రోజులు తరబడి వేచి ఉండవలసిన అవసరం ఏర్పడుతుంది. అయితే వాహనాలు పార్కింగ్ చేసుకోవడానికి స్థలం లేకపోవడంతో వాహనాలు జాతీయ రహదారి ప్రక్కనే నిలిపివేయడం చేస్తున్నారు. ఇలా రహదారుల పక్కన నిలిపిన వాహనాలు ఇతర వాహనాలు నడిపే డ్రైవర్లకు కనిపించకపోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ వందల సంఖ్యలో లారీల ఎగుమతులు దిగుమతులు జరుగుతున్న ఈ ఏరియాలో వాహనాల పార్కింగ్ కోసం స్థల సేకరణ భారం కాదని, ట్రాన్స్ పోర్ట్ యజమానులు నర్సరీ అసోసియేషన్ వారు స్థానిక పెద్దలు నాయకులు అందరూ కలిసి స్థల సేకరణ చేయగలిగితే ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని స్థానికులు సూచిస్తున్నారు. ఎన్ హెచ్ ఎ ఐ అధికారులు పోలీసులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై కడియం సీఐ వెంకటేశ్వరరావు ను వివరణ కోరగా నిబంధనలు పాటించకుండా రహదారుల పక్కన నిలుపుతున్న వాహనాలపై కేసులు నమోదు చేస్తామన్నారు.


