అంబులెన్స్లకూ తప్పని ఇబ్బందులు.. పట్టించుకోని నిర్వాహకులు
స్పందించి చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు, ప్రయాణికులు
నిబంధనలు కాగితాలకే పరిమితం
విశాలాంధ్ర – రాప్తాడు: నియోజకవర్గ కేంద్రం రాప్తాడు హైవే జంక్షన్ లో ఉన్న భారత్ పెట్రోలియం బంకు నిర్వాహకుల వైఖరి వల్ల ప్రయాణికులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. నిరంతరం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే జాతీయ రహదారిపై ఉన్న ఈ బంకు యాజమాన్యం గత మూడు నెలలుగా కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తుండటంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సమయం దాటినా తెరవని బంకు:
రాప్తాడు హైవే జంక్షన్ లోని ఈ భారత్ పెట్రోలియం బంకు ఉదయం 6 గంటలు దాటినా తెరవకపోవడంతో ద్విచక్ర వాహనదారులు, లారీలు, ఆటోలు ఇంధనం లేక ఇబ్బందులు పడుతూ వెనుదిరుగుతున్నాయి. జాతీయ రహదారిపై 24 గంటలూ అందుబాటులో ఉండాల్సిన బంకును ఇలా సమయపాలన లేకుండా మూసివేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అంబులెన్స్ కూ తప్పని తిప్పలు:
ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో అనంతపురం నుండి బెంగళూరు వైపు వెళ్తున్న ఒక అత్యవసర అంబులెన్స్ డీజిల్ కోసం ఈ బంకుకు వచ్చింది. తీరా బంకు మూసి ఉండటంతో అత్యంత విలువైన సమయం వృథా అయి, చేసేదేమీ లేక వేరే బంకుకు వెళ్లాల్సి వచ్చింది. అత్యవసర సేవలకూ స్పందించని పరిస్థితి ఇక్కడ నెలకొంది.
రైతులు, ఉద్యోగుల ఇక్కట్లు:
ఉదయాన్నే పొలం పనులకు వెళ్లే రైతులు, విధులకు హాజరయ్యే ఉద్యోగులు సమయానికి ఇంధనం దొరక్క అవస్థలు పడుతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే.. సిబ్బంది కొరత అక్కడ పనిచేసే వారు సమాధానం ఇస్తుండటం గమనార్హం. దీనిపై నిర్వాహకుని అడిగితే సిబ్బంది కొరత వాస్తవమేనని పనిచేయడానికి ఎవరూ రావట్లేదని అంటున్నారు.
మౌలిక వసతులు కరవు:
చమురు సంస్థల నిబంధనల ప్రకారం బంకుల్లో ఉచితంగా కల్పించాల్సిన వాహనాలకు గాలి, తాగునీరు, అత్యవసర ప్రథమ చికిత్స కిట్, ఫైర్ సేఫ్టీ వంటి కనీస మౌలిక వసతులు ఇక్కడ ఎక్కడా కనిపించడం లేదు. నిబంధనలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి.
అధికారులు చర్యలు చేపట్టాలి:
రాప్తాడు హైవే జంక్షన్ లో ఉన్న ఈ పెట్రోల్ బంకుపై సంబంధిత చమురు సంస్థల ఉన్నతాధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు తక్షణమే స్పందించాలి. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం బంకు సేవలు నిరంతరం కొనసాగేలా చూసి, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.


