. 36 పథకాలను ఏకీకృతం చేసే పథకం
. ఏటా రూ.24 వేల కోట్ల వ్యయం
. పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.20వేల కోట్ల పెట్టుబడికి అవకాశం
. శుభాంశు శుక్లాను అభినందిస్తూ తీర్మానానికి ఆమోదం
. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
న్యూదిల్లీ : దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ, పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఆయన నివాసంలో మంత్రివర్గం భేటీ అయింది. పీఎం ధన్ ధాన్య కృషి యోజనను ఆమోదించింది. పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.20 వేల కోట్ల వరకు పెట్టుబడులకు అనుమతి మంజూరు చేసింది. అంతరిక్షంలో 18 రోజులు గడిపి, అనేక ప్రయోగాలు నిర్వహించి భూమికి తిరిగివచ్చిన వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. వ్యవసాయ, అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఏటా రూ.24వేల కోట్ల వ్యయంతో దేశ వ్యాప్తంగా 100 జిల్లాల్లో పీఎం ధన్ ధాన్య కృషి యోజన అమలునకు కేబినెట్ అంగీకరించింది. 2025-26 నుంచి ఆరేళ్లు దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. సమావే శంలో కీలక నిర్ణయాలు జరిగినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడిరచారు. పీఎం ధన్ ధాన్య కృషి యోజన ద్వారా ద్వారా 1.70 కోట్ల మంది రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ఈ పథకం నీతి ఆయోగ్ ‘ఆకాంక్ష జిల్లాల’ కార్యక్రమం నుంచి ప్రేరణ పొందిందని, ప్రత్యేకంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తుందన్నారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసరించడం, పంచాయతీ, బ్లాక్ స్థాయిలో నిల్వ సౌకర్యాలను పెంచడం, నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచడం వంటి లక్ష్యాలను నిర్దేశిస్తుందన్నారు. ఇది 11 మంత్రిత్వ శాఖల పరిధిలోని 36 పథకాల సమన్వయం ద్వారా అమలవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కూడా ఉంటుందని అన్నారు. ‘తక్కువ ఉత్పాదకత, తక్కువ పంట సైకిల్, తక్కువ రుణ పంపిణీ వంటి మూడు ప్రధాన ప్రమాణాల ఆధారంగా 100 జిల్లాలను ఎంపిక చేస్తారు. ప్రతి రాష్ట్రం నుంచి కనీసం ఒక జిల్లాను చేర్చుకుంటారు. ఇప్పటికే ఉన్న 36 పథకాలను ఇది ఏకీకృతం చేస్తుంది’ అని వైష్ణవ్ తెలిపారు. పంట కోత తర్వాత నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుందని, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరుస్తుందని, వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుందని చెప్పారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడం, పంటల్లో వైవిధ్యీకరణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, పంటకోత తర్వాత గ్రామస్థాయిల్లో దిగుబడులను నిల్వ చేసేందుకు గోదాముల సదుపాయం, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం, రుణ లభ్యతను సులభతరం చేయడమే లక్ష్యంగా పీఎం ధన్ ధాన్య కృషి యోజనను రూపొందించారని వైష్ణవ్ వెల్లడిరచారు. ‘ఈ పథకం సమర్థ అమలునకు జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ధన్-ధాన్య జిల్లాలో ఈ పథకం పురోగతిని 117 పెర్ఫామెన్స్ ఇండికేటర్ల ద్వారా పర్యవేక్షిస్తారు. తద్వారా ఏటా 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలిగే అవకాశమున్న’ట్లు వైష్ణవ్ తెలిపారు.
పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ పెట్టుబడులు
ఎన్‌టీపీసీ లిమిటెడ్‌కు పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడుల కోసం ప్రస్తుతమున్న పరిమితికి మించి రూ. 20,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి కేబినెట్ అనుమతి ఇచ్చింది. ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్ల ద్వారా ఈ పెట్టుబడి ఉంటుంది. 2032కి 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌కు రూ.7వేల కోట్ల పెట్టుబడికి ప్రత్యేక మినహాయింపు లభించింది.ఈ మొత్తాన్ని అది తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఎన్‌ఎల్‌సీ ఇండియా రెన్యెవబుల్స్ లిమిటెడ్ ద్వారా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో పెట్టుబడి పెడుతుంది.


