విశాలాంధ్ర -పామిడి : తమ డిమాండ్ల సాధన కోసం గత 15 రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్న వైద్యాధికారులకు మద్దతుగా, పామిడి మండలం పరిధిలోని ఎద్దులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) సిబ్బంది సోమవారం నిరసన తెలిపారు.వైద్యాధికారులు సమ్మెకు దిగిన నేపథ్యంలో, పీహెచ్సిలోని ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తూనే నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైద్యాధికారులు చేస్తున్న సమ్మె న్యాయబద్ధమైందని, వారి డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.వైద్యులు లేకపోవడం వల్ల ప్రాథమిక ఆరోగ్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రజారోగ్యానికి భంగం కలగకుండా సమస్యను వెంటనే పరిష్కరించి,డాక్టర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి అని వారు డిమాండ్ చేశారు. పీహెచ్సిలోని నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు అందరూ ఈ నిరసనలో పాల్గొని, సమ్మె చేస్తున్న డాక్టర్లకు తమ పూర్తి సంఘీభావాన్ని తెలియజేశారు.


