– ధర్మవరంలో ప్రత్యేక బియ్యం కౌంటర్ల ప్రారంభం
మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;;పట్టణంలోని రైతు బజార్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటు ధరలో అందిస్తున్న ప్రత్యేక బియ్యం కౌంటర్ ద్వారా నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ రాంభూపాల్ రెడ్డి, ధర్మవరం తహసీల్దార్ దేవరాజు, సి.ఎస్.డి.టి. రమణ బాబుతో కలిసి ప్రత్యేక బియ్యం కౌంటర్‌ను ప్రారంభించి లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ సామాన్య ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందుబాటు ధరలో అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లలో ప్రత్యేక బియ్యం కౌంటర్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. మధ్యతరగతి, పేద కుటుంబాలకు నాణ్యమైన బియ్యం సరసమైన ధరలో అందుబాటులోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ధర్మవరం మండలానికి ప్రారంభ దశలో 50 క్వింటాళ్ల నాణ్యమైన బీపీటీ ముడి బియ్యం కేటాయించబడిందని తెలిపారు. ప్రతి కుటుంబానికి నెలకు గరిష్ఠంగా 10 కిలోల బియ్యం అందించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక బియ్యం కౌంటర్ ద్వారా బియ్యం కొనుగోలు చేయడానికి మొబైల్ యాప్ అందుబాటులో ఉందని, ఈ యాప్ ద్వారా సులభంగా నమోదు చేసుకుని బియ్యాన్ని కొనుగోలు చేయవచ్చని వివరించారు. సాంకేతికతను వినియోగిస్తూ పారదర్శకంగా పంపిణీ ప్రక్రియ కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే అందిస్తూ కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా కృషి చేస్తోందని అన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు నాణ్యతతో పాటు అందుబాటు ధరలో అందించేలా ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రాంభూపాల్ రెడ్డి, ధర్మవరం తహసీల్దార్ దేవరాజు, సి.ఎస్.డి.టి. రమణ బాబు, జనసేన నాయకులు రాజారెడ్డి, బిజెపి నాయకులు నేలకోట రాము, ధనుంజయ, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతు బజార్ సిబ్బంది, లబ్ధిదారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


