కళ్యాణదుర్గంలో సిపిఐ బైక్ జాత ప్రారంభం
వర్షాభావంతో తీవ్ర సంక్షోభంలో రైతులు – కార్పొరేట్లకు అనుకూలంగా ప్రభుత్వాల విధానాలు
విశాలాంధ్ర – కళ్యాణదుర్గం: ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావం, అనిశ్చిత వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారని, ఇలాంటి సమయంలో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కామ్రేడ్ డి. జగదీష్ విమర్శించారు. రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా పూర్తిస్థాయి రుణమాఫీ ప్రకటించాలని, పంట నష్టాలకు తక్షణ పరిహారం చెల్లించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
“మార్పు రావాలి – మార్పు అనివార్యం” అనే నినాదంతో దేశవ్యాప్తంగా సిపిఐ చేపడుతున్న ఆందోళనల్లో భాగంగా మంగళవారం కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాల సమగ్ర అభివృద్ధి కోసం రెండు రోజుల బైక్ జాతను సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కామ్రేడ్ డి. జగదీష్ ప్రారంభించారు. సుమారు 60 గ్రామాల మీదుగా ఈ జాత కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు.ప్రారంభ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు కేంద్రబిందువుగా మారిందని ఆరోపించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రూపాయి విలువ పతనం వంటి సమస్యలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజల సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలు అమలు చేస్తోందని, సామాన్య ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.అయోధ్య హుండీ నిధుల వ్యవహారం, జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ పారదర్శక పాలన అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉద్యమాల ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు–పవన్ కళ్యాణ్–బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజలపై అప్పుల భారం మోపుతోందని విమర్శించారు. అమరావతి నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూనే రైతులకు గిట్టుబాటు ధరలు, రుణమాఫీ, సాగునీటి సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి భారీగా ప్రజాధనం వెచ్చించడాన్ని కూడా తప్పుబట్టారు.అనంతపురం జిల్లాలో ఎనిమిది లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా కేవలం రెండు లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు జరుగుతోందని, దీనికి వర్షాభావంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. పంట బీమా సొమ్మును వెంటనే విడుదల చేసి ఖరీఫ్ పంట నష్టాలను అంచనా వేసి రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.కళ్యాణదుర్గం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకురావడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, హంద్రీ–నీవా, మెగా కమ్యూనిటీ డ్రిప్ వంటి సాగునీటి పథకాలను వేగవంతం చేయాలని కోరారు. అనంతపురం సాగునీటి ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గం తాగునీరు, సాగునీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. 114 చెరువులకు నీరు అందించే హంద్రీ–నీవా పథకాన్ని పూర్తి చేయాలని, రైతు ఆత్మహత్యలు నివారించేందుకు వెంటనే రుణమాఫీ అమలు చేయాలని కోరారు.
నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించిన రూ.90 కోట్ల పరిహారాన్ని రైతులకు ఇప్పటికీ చెల్లించలేదని విమర్శించారు. తిమ్మసముద్రం ఏపీఐఐసీ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని, నియోజకవర్గ రహదారులను అభివృద్ధి చేయాలని, లక్ష ఎకరాలకు సాగునీరు అందించే మెగా కమ్యూనిటీ డ్రిప్ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
కార్యక్రమంలో సిపిఐ నాయకులు నరసింహులు, ఓంకార్, ఆంజనేయులు, నాగరాజు నాయక్, తిమ్మరాయుడు, వైసీపీ నాయకులు సుధీర్ చంద్రశేఖర్ రెడ్డి, గోల్ల సూరి, హనుమంతరాయుడు, సిపిఎం నాయకులు అచ్యుత్, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, రైతులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


