రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం తర్వాత రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగిస్తున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న వాణిజ్య అనిశ్చితి దృష్ట్యా తటస్థ వైఖరినే కొనసాగిస్తున్నట్టు వెల్లడించింది. రెపో రేటులో మార్పు లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న హోమ్ లోన్, వాహన రుణం, వ్యక్తిగత రుణాల ఈఎంఐలు వెంటనే పెరగవు. కొత్త రుణాలపై కూడా బ్యాంకులు ప్రస్తుత వడ్డీ రేట్లనే కొనసాగించే అవకాశం ఉంది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. అమెరికా కొత్త సుంకాలు విధించడం వల్ల ప్రపంచ వాణిజ్య పరిస్థితుల్లో అనిశ్చితి కొనసాగుతోందన్నారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రభావంతో ముడి చమురు ధరలు, ఆర్థిక మార్కెట్లు ఇంకా ఒడుదొడుకులకు లోనవుతున్నాయని చెప్పారు. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్) రేటును 5 శాతంగానే కొనసాగించారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటు, బ్యాంక్ రేటును 5.5 శాతంగా యథాతథంగా ఉంచారు.ద్రవ్యోల్బణం ఇటీవల కొంత పెరిగినా ఆర్‌బీఐ నిర్దేశించిన పరిమితుల్లోనే ఉందని గవర్నర్ తెలిపారు. ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకపు విలువలో మార్పులు, పశ్చిమాసియా పరిణామాలు ఆర్‌బీఐ నిర్ణయాలపై ప్రభావం చూపుతున్న ప్రధాన అంశాలుగా పేర్కొన్నారు.మరోవైపు దేశీయ ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. వృద్ధి రేటులో ఊపు కొనసాగడం, సానుకూల వర్షపాతం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తున్నాయని వెల్లడించింది.అయితే కొన్ని రంగాల్లో ప్రారంభ దశ ఒత్తిడి కనిపిస్తోందని సంజయ్ మల్హోత్రా అన్నారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి అంచనాల చుట్టూ ఇంకా గణనీయమైన ప్రమాదాలు పొంచి ఉన్నాయని వ్యాఖ్యానించారు.
జూన్‌లో జరిగిన గత ఎంపీసీ సమావేశంలో కూడా రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగించారు. అదే సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి అంచనాను 6.9 శాతం నుంచి 6.6 శాతానికి ఆర్‌బీఐ తగ్గించింది. ప్రపంచ అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, ఇంధన ధరల పెరుగుదల ఇందుకు కారణాలని అప్పట్లో పేర్కొంది.


