విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : జిల్లాలోని రెవెన్యూ రికార్డుల్లో దొర్లిన తప్పులన్నిటినీ సరిదిద్ది, భూ వివాదాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాజాంలో జరిగిన చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రీ-సర్వేలో జరిగిన లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు.
వీఆర్వోలు, సర్వేయర్లు క్షేత్రస్థాయిలో రైతులతో నేరుగా మాట్లాడి వివరాలు పరిశీలించాలని, తప్పుల్లేని పాస్ పుస్తకాలను మాత్రమే ముద్రణకు పంపాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న 3,896 పాస్ పుస్తకాలను ఫిబ్రవరి 10లోగా సరిచేసి రైతులకు అందజేయాలని గడువు విధించారు. జాయింట్ ఎల్పీఎంల వల్ల ఏర్పడుతున్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్, ఇంచార్జి ఆర్డీవో ప్రమీల గాంధీ, సర్వే శాఖ ఏడీ విజయకుమార్, తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్వోలు తదితర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేయాలి : కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
- Advertisement -


