ఒకరికి తీవ్రగాయాల
విశాలాంధ్ర – విజయవాడ (క్రైం) : నమస్కారం పెట్టలేదంటూ.. ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామెన్‌లపై ఒక రౌడీషీటర్ దాడికి పాల్పడిన ఘటన అజిత్‌సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బసవతారకనగర్ చర్చి వద్ద శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సాక్షి టీవీ కెమెరామెన్ పాటిబండ్ల సంతోష్‌కుమార్, డీ ఛానల్ కెమెరామెన్ ప్రదీప్, ఏబీఎన్ ఛానల్ కెమెరామెన్ విలియం గోల్డ్‌స్టోన్ బసవతారకనగర్ చర్చి వద్ద కూర్చుని ఉండగా, అటుగా వెళుతున్న రౌడీషీటర్ మాలప్రోలు శివనాగ మహేష్ తనకు నమస్కారం పెట్టలేదంటూ ఘర్షణకు దిగాడు. అంతేగాకుండా వారిపై దాడికి పాల్పడిన అతను, కొద్దిసేపట్లోనే ఇంటికి వెళ్లి కత్తి తీసుకువచ్చి సంతోష్‌కుమార్ తలపై పొడిచాడు. దీంతో అతనికి తీవ్రరక్తసిక్తమవ్వగా, మిగిలిన కెమెరామెన్‌లు ఎదురుదాడికి దిగేలోగానే అక్కడ నుంచి రౌడీషీటర్ ఉడాయించాడు. అనంతరం గాయపడిన కెమెరామెన్‌ను ఆసుపత్రికి తరలించి, అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు, రౌడీషీటర్ కోసం రెండు బృందాలను ఏర్పాటు చేశారు. కాగా, రౌడీషీటర్ మహేష్‌పై గతంలో హత్యాయత్నం, గంజాయి కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


