ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా కార్మిక, కర్షక సోదరులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. శ్రమ దోపిడికి వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు జరిపిన పోరాట ఫలితంగా కార్మిక లోకంలో చైతన్యం వెల్లివిరిసింది. ఆనాటి దోపిడి విధానాలను సమూలంగా మార్చుకుని కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు ఇది అని చంద్రబాబు పేర్కొన్నారు. కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్లదని.. కూటమి ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వంగా, కష్టజీవుల ప్రభుత్వంగా ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. ఈ మేరకు చంద్రబాబు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.
ఁఅంతర్జాతీయ మే డే సందర్భంగా కార్మిక సోదరులకు నా శుభాకాంక్షలు. శ్రమ దోపిడికి వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు జరిపిన పోరాట ఫలితంగా కార్మిక లోకంలో చైతన్యం వెల్లివిరిసింది. ఆనాటి దోపిడి విధానాలను సమూలంగా మార్చుకుని కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు ఇది. కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్ళదు. కార్మిక, కర్షకులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ముందుకు వెళ్లడం ప్రస్తుతం అత్యంత అవసరం. కార్మిక వర్గం పక్షాన నిలబడి వారికి మేలు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.
నాలా చట్టం రద్దు, ఉచిత ఇసుక విధానం, భవన నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులు సరళతరం చేయడం వంటి నిర్ణయాలతో ఇప్పటికే నిర్మాణ రంగాన్ని నిలబెట్టి లక్షల మంది జీవితాలకు భద్రత కల్పించాం. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుతో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టిస్తాం. కూటమి ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వంగా, కష్టజీవుల ప్రభుత్వంగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. మరొక్క మారు అందరికీ మే డే శుభాకాంక్షలుఁ అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: మంత్రి లోకేశ్
ఁకార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజే మే డే. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు. కూటమి ప్రభుత్వ పాలనలో కార్మికులు, కర్షకుల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం. వారికి అన్ని విధాల అండగా నిలుస్తున్నాం. కార్మిక సోదర, సోదరీమణులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలుఁ అంటూ మంత్రి లోకేశ్ పోస్టు చేశారు.