ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై పి.జగదీష్ క్షేత్రస్థాయి పరిశీలన
విశాలాంధ్ర–తాడిపత్రి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతంగా పేరున్న తాడిపత్రి పట్టణంపై జిల్లా ఎస్పీ పి.జగదీష్ ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం పట్టణంలో పర్యటించిన ఆయన ఎన్నికల భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. తొలుత తాడిపత్రి పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ఈవీఎంల పంపిణీ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల సామగ్రి భద్రత, సిబ్బంది రాకపోకలు, కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి నామినేషన్ల స్వీకరణ సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.పట్టణంలోని సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలైన నందలపాడు, ఓంశక్తినగర్, శ్రీనివాసపురంలలో పర్యటించి స్థానిక పరిస్థితులను సమీక్షించారు. రౌడీషీటర్లు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని పోలీసు సిబ్బందికి సూచించారు.ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రజలు భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రత కల్పించాలని ఎస్పీ స్పష్టం చేశారు.ఈ పర్యటనలో తాడిపత్రి డీఎస్పీ ఎం.చంద్రశేఖర్, సీఐలు క్రాంతికుమార్, ఆరోహణరావు, నారాయణరెడ్డి, శ్రీనివాసులు, నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


