దేశవ్యాప్తంగా ప్రయాణించే ప్రజలకు జాతీయ రహదారులపై శుభ్రంగా ఉండే మరుగుదొడ్ల సౌకర్యం అందించేందుకు ‘నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా’ (NHAI) ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించింది.ఇకమీదట మీరు హైవేపై ప్రయాణిస్తుండగా మురికిగా ఉన్న టాయిలెట్ కనిపిస్తే, దాని ఫోటో తీసి పంపించండి – దానికి బహుమతిగా ₹1000 ఫాస్టాగ్ రీచార్జ్ పొందవచ్చు.
“క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్” ఈ ప్రత్యేక కార్యక్రమం అక్టోబర్ 31, 2025 వరకు దేశంలోని అన్ని నేషనల్ హైవేల్లో కొనసాగుతుంది.ప్రజల్లో భాగస్వామ్యాన్ని పెంచి, హైవే టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడం ఈ యూనిక్ క్యాంపెయిన్ ప్రధాన లక్ష్యం.
ఎలా పాల్గొనాలి?
ముందుగా మీ మొబైల్‌లో ‘రాజమార్గయాత్ర’ (RajmargYatra) యాప్ తాజా వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకోండి.
హైవేపై మీరు చూసిన మురికిగా ఉన్న టాయిలెట్ ఫోటోను తీసి అదే యాప్ ద్వారా అప్‌లోడ్ చేయండి.
ఫోటోతో పాటు మీ పేరు, లొకేషన్, వాహన రిజిస్ట్రేషన్ నంబర్ (VRN) మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయాలి.మీరు పంపిన ఫోటోను NHAI అధికారులు పరిశీలించి ధృవీకరించిన తర్వాత, మీ వాహనానికి లింక్ అయిన ఫాస్టాగ్ ఖాతాలో ₹1000 రీచార్జ్ జమ అవుతుంది.ఒక్క వాహన నంబర్‌కు ఒక్కసారి మాత్రమే ఈ రివార్డ్ లభిస్తుంది.ఈ బహుమతిని నగదు రూపంలో పొందడం సాధ్యం కాదు.
ఏయే టాయిలెట్లకు మాత్రమే వర్తిస్తుంది?
ఈ స్కీమ్ కేవలం NHAI నిర్వహణలో ఉన్న లేదా వారి ఆధీనంలోని టాయిలెట్లకే వర్తిస్తుంది.
టోల్ ప్లాజాల వద్ద ఉన్న ఈ టాయిలెట్లను జియో-ట్యాగ్‌తో పాటు సమయంతో స్పష్టంగా ఫోటోలు తీయాలి.
పెట్రోల్ బంక్‌లు, ధాబాలు, ప్రైవేట్ రెస్ట్ ఏరియాలు లేదా ఇతర వ్యక్తిగత ప్రాంగణాల్లోని టాయిలెట్లు ఈ పథక పరిధిలోకి రావు.
ముఖ్య నిబంధనలు
ఒక టాయిలెట్‌కు రోజులో ఒక్కసారి మాత్రమే రివార్డ్ ఇవ్వబడుతుంది.
ఒకే టాయిలెట్ ఫోటోను పలువురు పంపినప్పటికీ, మొదటగా వచ్చిన స్పష్టమైన & జియో-ట్యాగ్ ఫోటోకే బహుమతి లభిస్తుంది.ఒకే ఫోన్ నంబర్‌తో వేర్వేరు టోల్ ప్లాజాల టాయిలెట్ల ఫోటోలు పంపించినా, వాటిలో ఒకదానికే రివార్డ్ ఇవ్వబడుతుంది.
మీరు
50%
శాతం పూర్తి చేశారు
వివరాలు
ఏ ఫోటోలను అంగీకరించరు?
అస్పష్టమైన, మార్పులు చేసిన, డూప్లికేట్ లేదా ఇప్పటికే ఇతరులు పంపిన ఫోటోలను అధికారులు తిరస్కరిస్తారు.
అవసరమైతే, AI ఆధారిత స్క్రీనింగ్, మాన్యువల్ వెరిఫికేషన్ ద్వారా ఫోటోలు పరిశీలిస్తారు.
హైవేలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యం
దేశవ్యాప్తంగా రహదారులను పరిశుభ్రంగా, అందంగా ఉంచేందుకు NHAI ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది.వీటిలో రోడ్ల పక్క పరిశుభ్రత, టోల్ ప్లాజాల అలంకరణ, రోడ్ సేఫ్టీ బోర్డులు ఏర్పాటు, గోడలపై చిత్రలేఖనం, ఆక్రమణల తొలగింపు వంటి చర్యలు ఉన్నాయి.ఈ ‘క్లీన్ టాయిలెట్ ఛాలెంజ్’ కూడా ఆ క్రమంలో మరో ముఖ్యమైన ముందడుగు. కాబట్టి, హైవేపై ప్రయాణించే సమయంలో మీరు మురికిగా ఉన్న టాయిలెట్ గమనిస్తే, వెంటనే ఫోటో తీసి ‘రాజమార్గయాత్ర’ యాప్‌లో అప్‌లోడ్ చేయండి.
₹1000 ఫాస్టాగ్ రీచార్జ్ రివార్డ్ పొందడంతో పాటు, ‘క్లీన్ హైవే మిషన్’లో భాగస్వామి అవ్వండి!


