విశాలాంధ్ర – ఉరవకొండ: ఉరవకొండలో సోమవారం రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నాయకులు భూ కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ధర్నాలో పాల్గొనేందుకు ఉరవకొండకు వస్తున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ మంత్రి శంకర్ నారాయణలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ధర్నా ప్రదేశానికి చేరుకున్న పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు.అరెస్టుల సందర్భంగా పోలీసులకు, వైఎస్సార్సీపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేసే సమయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశ్వేశ్వరరెడ్డిని తీసుకెళుతున్న పోలీసు వాహనం వెళ్లకుండా రోడ్డుపై రాళ్లు, ఇతర వస్తువులు వేసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును అడ్డుకుంటూ ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా ప్రజాస్వామ్య హక్కులను హరిస్తోందని ఆరోపించారు.మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ ఆదేశాలతో ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకుల భూములను కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు కౌడికి గోవిందుకు చెందిన 21 ఎకరాల భూమిని టీడీపీ నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. శాంతియుత నిరసనకు కూడా అనుమతి ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ప్రతిపక్షాలకు శాంతియుత ఆందోళన హక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ పోలీసులు దానిని పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులు, కేసులకు భయపడబోమని, ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా, వైఎస్సార్సీపీ, టీడీపీతో పాటు దేవాలయ భూముల పరిరక్షణ సమితి కూడా ఒకే రోజు ఉరవకొండలో ఆందోళనలకు అనుమతి కోరిన నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని భావించి ఏ వర్గానికీ ధర్నా, నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు వెల్లడించారు.
ఉరవకొండలో ఉద్రిక్తత.. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్
- Advertisement -
RELATED ARTICLES


