విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం సిపిఐ, ఏపీ మహిళా సమాఖ్య ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య ఆధ్వర్యంలో మహాత్మా గాంధీవర్ధంతిని పురస్కరించుకొని సామూహిక సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య మాట్లాడుతూ దేశంలో గ్రామీణ పేదల వలసల నివారణ, ఆర్థిక భరోసా కల్పించడానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తోందన్నారు. ఈ పథకం వల్ల పేద ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి బ్యాంకు మెట్లు ఎక్కగలుగుతున్నారని రిజర్వ్ బ్యాంకు కితాబు ఇచ్చింది. ఈ పథకానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును విబిజీ రాంజీ మార్పు చేసి గ్రామీణ పేదల ఆర్థిక పరిస్థితిపై దెబ్బ కొట్టే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో సిపిఐ మండల కార్యదర్శి నాగరంగయ్య, చింతా పురుషోత్తం, జయలక్ష్మి, నారాయణరెడ్డి, లక్ష్మి, లక్ష్మీదేవి, గోపాల్, నరసింహులు పాల్గొన్నారు.


