నాయకులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి డా. స్వామి
కొండపి పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం నాడు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో కొండపి గ్రామ టీడీపీ నాయకులతో మంత్రి స్వామి సమావేశమయ్యారు. ఆగస్టు 10 న కొండపి పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంత్రి నాయకులతో చర్చించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి డా. స్వామి మాట్లాడుతూ సుమారు 14 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ఏడాదిలోనే నియోజకవర్గంలో ప్రత్యేకించి కొండపి గ్రామంలో కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసామన్నారు. నేటి నుంచి ఎన్నికల రిజల్ట్ వరకు టీడీపీ నేతలు బీజేపీ, జనసేన నాయకులు ఈ ఎన్నికలపై దృష్టి సారించాలన్నారు. కొండపి ఎన్నికల్లో అందరూ ఐకమత్యంగా పనిచేసి కూటమి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.


