కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 24 గంటల్లోపే మహిళలకు ఉచిత బస్సు పథకం తెచ్చిందని మంత్రి సీతక్క అన్నారు. ఉచిత ప్రయాణమే కాదు మహిళలను బస్సులకు ఓనర్లను చేసిందన్నారు. మహిళల ఎదుగుదలనే సమాజ ఎదుగుదల అని చెప్పుకొచ్చారు. ఆ స్పూర్తితోనే తమ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. గతంలో పావలా వడ్డీ రుణాలు ఇవ్వలేదని.. వడ్డీలేని రుణాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళల అనుభవాలను తెలిపే పుస్తకం ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. మండల సమాఖ్యలో ఉన్న మహిళల కోరికలు నెరవేరుతున్నాయన్నారు. మహిళా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారని మంత్రి చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి 25 వేల కోట్ల రుణాలను మహిళా సంఘాలు పొందాయని పేర్కొన్నారు. తీసుకున్న రుణాలను ఎప్పటికప్పుడు చెల్లిస్తుండడంతో బ్యాంకులు ఇబ్బందులు లేకుండా రుణాలు ఇస్తున్నాయన్నారు. మహిళలందరూ ఎల్లుండి నుంచి సంబరాలు చేయాలని.. ప్రభుత్వ ప్రోత్సహకాలన్నీ సంఘాలు ఉపయోగించుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.