అధికారుల నిర్లక్ష్యమో.. లేక పంచాయతీ పాలకవర్గం
గ్రామాలలో పట్టపగలే వెలుగుతున్న వీధిలైట్లు పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు
విశాలాంధ్రపొన్నలూరు
మండలంలోని పలు గ్రామాలలో పట్టపగలు నిరంతరం వీధిలైట్లు వెలుగుతూ వారి నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. వీధి దీపాల నిర్వహణలో ఉన్న సమస్యలను విద్యుత్ సిబ్బంది పట్టించుకోవటం లేదని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని చాలా గ్రామాలలో పగటివేళలో సైతం విద్యుత్ దీపాలు వెలుగుతుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది గ్రామపంచాయతీకి అదనపు భారమని తెలిసినప్పటికీ పాలకవర్గం పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. విద్యుత్ వృథా అరికట్టాల్సిన ట్రాన్స్‌కో అధికారులు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా నిత్యం వెలుగుతుండడంతో వందలాది యూనిట్లు విద్యుత్తు వృధా అవుతుంది పంచాయతీ ఆదాయం జనాభా మేరకు ఆయా గ్రామాలలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయగా రాత్రిపూట ఆన్ చేసి ఉదయం పూట ఆఫ్ చేయాలి. కానీ అలా జరగటం లేదు దీంతో గ్రామపంచాయతీలకు వేల రూపాయల విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. ఇప్పటికైనా వీధిలైట్లకు ఆన్ ఆఫ్ స్విచ్‌లు ఏర్పాటు చేసి పగలు వెలగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.


