విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆనందరాజు డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పథకం పరిరక్షణ యాత్ర పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘వికసిత్ భారత్ జీ రామ్ జీ’ పేరును రద్దు చేసి, మహాత్మాగాంధీ పేరు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే కూలీలకు రోజువారీ కనీస వేతనం 600 రూపాయలకు పెంచి, 150 పని దినాలు పెంచాలన్నారు. కేంద్రం – రాష్ట్రాల నిధుల వాటా 60:40 నిష్పత్తితో కాకుండా యధావిధిగా 90:10 నిష్పత్తితో కొనసాగించాలని కోరారు. రాష్ట్రాల, పంచాయతీల అధికారాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసి సెల్ చైర్మన్ హనుమంతరెడ్డి, నియోజకవర్గ నాయకులు తిక్కన్న, నాయకులు నరసప్ప, బాషా తదితరులు పాల్గొన్నారు.


