–సర్పంచ్ మూలింటి రాధమ్మ
–300 ఏళ్ల నాటి సింహద్వారం పునర్నిర్మాణం
–అట్టహాసంగా సింహద్వారం ప్రారంభం
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండల కేంద్రమైన ఆస్పరి గ్రామానికి శతాబ్దాల కలగా మిగిలిన ఘన చరిత్రకు నేడు కొత్త ప్రాణం పోసారు. సుమారు 300 ఏళ్ల క్రితం కూలిపోయిన ప్రాచీన గ్రామ సింహద్వారం (ఊరి వాకిటి) మళ్లీ భవ్యంగా తలెత్తింది. గ్రామపంచాయతీ నిధులు రూ.40 లక్షలకు పైగా వ్యయం చేసి, పూర్తిగా రాతికట్టుతో అద్భుతంగా పునర్నిర్మించారు. ఈ సింహద్వారం నేడు ఆస్పరి గ్రామ గౌరవానికి, సంస్కృతికి, చరిత్రకు నిలువెత్తు ప్రతీకగా నిలిచింది. బుధవారం ఉదయం ఘనంగా జరిగిన ప్రారంభోత్సవంలో సర్పంచ్ మూలింటి రాధమ్మ, ఉపసర్పంచ్ వార్డు సభ్యులు స్వయంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, రిబ్బన్ కట్ చేసి అట్టహాసంగా ప్రారంభించి ఈ చారిత్రక కట్టడాన్ని గ్రామ ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మూలింటి రాధమ్మ మాట్లాడుతూ మన ఊరి గతాన్ని గౌరవిస్తూనే, భవిష్యత్ తరాలకు అందించాలనే సంకల్పం, గ్రామ ప్రజల ఆశీస్సులతో ఈ సింహద్వారం నిర్మించామని తెలిపారు. గ్రామ సింహద్వారం అనేది కేవలం నిర్మాణం కాదని, ఇది గ్రామ సంస్కృతికి ప్రతీకగా, సంప్రదాయాలకు గుర్తుగా, ఐక్యతకు చిహ్నంగా నిలిచిందని తెలిపారు. ఇది నా వ్యక్తిగత ఘనత కాదని, ఇది గ్రామ ప్రజలందరి ఘనత అన్నారు. మేజర్ గ్రామపంచాయతీ ప్రజలు నాపై పెట్టిన అపారమైన నమ్మకం, ప్రేమ, ఆదరణను ఎప్పటికీ తీర్చుకోలేనిదని భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నో తరాల తర్వాత మా ఊరికి తిరిగి ఒక గౌరవం వచ్చిందని, కలలా మిగిలిన గ్రామ సింహద్వారం ఇప్పుడు నిజంగా రాతి కట్టడంతో నిర్మించిన సింహద్వారం మా ఊరికి గుర్తింపు మళ్లీ తిరిగి వచ్చినట్టుందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. పండుగ వాతావరణం తలపించింది. ఈ కార్యక్రమంలో సీఐ గంగాధర్, జడ్పిటిసి దొరబాబు, వైస్ ఎంపీపీ లింగమ్మ తనయుడు ప్రకాష్, ఉప సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, గ్రామ పెద్దలు ఎస్.తిమ్మన్న, దుమ్మ వెంకటరాముడు, యాగంటి కృష్ణ యాదవ్, భోగం రాముడు, సతీష్ కుమార్, గఫూర్, వార్డు సభ్యులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.


