ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి
విశాలాంధ్ర- ఉరవకొండ : రైతుల పడుతున్న కష్టాలు, బాధలు కనిపించనీయకుండా, దీనిమీద చర్చజరగకుండా వాటికి ముసుగు వేసి చంద్రబాబు తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి రైతన్నా.. మీకోసం’’ అంటూ రైతులను మోసం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. సోమవారం స్థానిక వైసిపి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో రైతులకోసం ఏం చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు. రికార్డు స్థాయిలో పంటల ధరలు దారుణంగా పతనమైనా మీరు రైతులవైపు కన్నెత్తిచూడ్డం లేదన్నారు. ప్రభుత్వం నుంచి ఏమాత్రం ఆసరాలేక రైతులు తాము వేసిన పంటలను తామే ట్రాక్టర్లతో దున్నివేసే పరిస్థితులు తీసుకు వచ్చారని ఆరోపించారు. ధరలు పతమై దీన స్థితిలో రైతన్న ఉన్నాడని ధరల స్థిరీకరణకు వెంటనే డబ్బులు మంజూరుచేసి, రైతుల్ని ఆదుకునే చర్యలను ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా ధాన్యం, మొక్కజొన్న, అరటి, పత్తి ధరలు దారుణంగా పడిపోయినాయని మీరు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ధాన్యం, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, ఆరిటి, పత్తి ధరలు పడిపోయినా మీకు పట్టనట్టే వ్యవహరించారన్నారు.18 నెలల కాలంలో దాదాపు 16 సార్లు ప్రకృతి విపత్తుల వల్ల రైతులు నష్టపోతే కనీసం ఒక్కసారైనా ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఉచిత పంటల బీమాను రద్దుచేశారు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన, రైతులకు నష్ట పరిహారం కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికల్లో రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించారు. పీఎం కిసాన్‌కాకుండా ఏడాదికి రూ.2౦వేలు అన్నదాతా సుఖీభవ కింద ఇస్తామన్నారు. ఈ 2 ఏళ్లకు రూ. 40వేలకు గాను ఇచ్చింది కేవలం రూ.10వేలు. ఇచ్చారని తెలిపారు. చివరకు ఎరువులకోసం కూడా రైతులు బ్లాక్‌లో కొనుగోలు చేసుకునే దుస్థితికి తీసుకువచ్చారని రైతుల బతుకులు దళారీల పాలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ మోసాలను, మీ వంచనను ప్రశ్నించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ పార్టీ నాయకులు వీరన్న, బసవరాజు, భరత్ రెడ్డి, ఈడిగ ప్రసాద్, అశోక్ కుమార్, ఓబన్న తదితరులు పాల్గొన్నారు.


