— ఏపి ఈగల్ చీఫ్ ఐజిపి రవి కృష్ణ
విశాలాంధ్ర – రాజమండ్రి సిటీ :రాజమండ్రి కేంద్ర కారాగారాన్ని ఏపీ ఈగల్ చీఫ్, ఐజిపి ఆకే.రవికృష్ణ, మంగళవారం సందర్శించారు.ఈ సందర్బంగా రాజమండ్రి సెంట్రల్ జైలు లో గంజాయి కేసుల్లో జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్ డి పి ఎస్ చట్టం తీవ్రత ను వివరించారు. అనంతరం గంజాయి, నిషేధిత డ్రగ్స్ పై ఇక నేరాలు చేయబోమని ఖైదీలాచే ప్రతిజ్ఞ చేయించారు. ఎన్ డి పి ఎస్ చట్టం ..,1985 ప్రకారం డ్రగ్స్ అక్రమ రవాణా, నిల్వ, విక్రయం మాత్రమే కాకుండా, వాటి ద్వారా పొందిన అక్రమ ఆర్థిక లావాదేవీలను కూడా విచారించడం జరుగుతుందని ఈ క్రమంలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వ్యాపారాలు చేసే వ్యక్తులు, వారి సంబంధీకుల బ్యాంక్ ఖాతాలు, స్థిరాస్తులు, వాహనాలు, ఇతర ఆర్థిక వనరులపై దర్యాప్తు చేసి అక్రమ సొమ్మును గుర్తించి, సంబంధిత ఆస్తులను జప్తు చేయడం జరుగుతుందన్నారు. మత్తు పదార్థాల వ్యాపారం నుండి లాభం పొందే వారిపై కూడా కఠిన ఆర్థిక విచారణ చేపట్టి అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామన్నారు. మనీ ట్రైల్ ను అనుసరించి అక్రమ లావాదేవీలను బయటపెడతామని, డ్రగ్స్ మాఫియాను మూలాలతో సహా నిర్మూలించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎన్సీబీ, ఎక్సైజ్ మరియు ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేస్తున్నామన్నారు. అదే విధంగా ప్రీవెన్షన్ అఫ్ ఇలిసిట్ ట్రాఫిక్ లో ఎన్ డి పి ఎస్ యాక్ట్ ప్రకారం మత్తు పదార్థాల అక్రమ రవాణా, వ్యాపారంలో నిమగ్నమయ్యే వ్యక్తులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ చట్టం ప్రకారం మత్తు పదార్థాల రవాణా, నిల్వ, విక్రయాల పై నేరపూరిత కార్యకలాపాల్లో పాల్గొనేవారిని ఒక సంవత్సరం వరకు నిర్బంధంలో ఉంచే అధికారం పోలీసు విభాగానికి ఉంటుందన్నారు. పునరావృత నేరాలు లేదా పెద్ద స్థాయిలో మత్తు పదార్థాల రవాణా జరిపే వ్యక్తులపై ఈ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిషేధిత డ్రగ్స్,గంజాయి వ్యాపారం చేసి వారికి సహకరించిన, ఆర్థిక సహకారం అందించిన వారిపై కూడా ఎన్ డి పి ఎస్ చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు డ్రగ్-రహిత సమాజ నిర్మాణంలో అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఈ సందర్బంగా మత్తు పదార్థాల వాడకం,రవాణా వ్యాపారం,పండించడం వల్ల కలిగే దుష్పరిణామాలను ఖైదీలకు వివరించారు. ముద్దాయిలు భవిష్యత్తులో మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండి, సమాజంలో మంచి పౌరులుగా మారాలని సూచించారు. అలాగే జైలు అధికారులతో చర్చించి ముద్దాయిల పునరావాసం కోసం కౌన్సిలింగ్, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు. అలాగే గంజాయి కేసుల్లో ఖైదీ లుగా శిక్ష అనుభవిస్తున్న వారికి కొన్ని సూచనలు చేశారు. ఈ క్రమంలో మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండాలని, అవి వ్యక్తిగత ఆరోగ్యానికీ, కుటుంబానికీ, సమాజానికీ హానికరమని, శిక్ష అనంతరం సమాజంలో సత్పౌరులుగా మారాలని, వృత్తి నైపుణ్యాలను నేర్చుకోవాలని. కుటుంబాన్ని ఆపదలోకి నెట్టే అలవాట్లు, నేరాలు పూర్తిగా మానుకోవాలని,భవిష్యత్తులో చట్టవ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనకూడదని, మత్తు పదార్థాల వాడకం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని గుర్తించాలని,సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని, సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం ద్వారా నమ్మకం, గౌరవం తిరిగి పొందాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ కె.నాగేష్ బాబు ,జైలు సూపరింటెండెంట్ రాహుల్ , జైలు అధికారులు, ఈగల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


