గోదావరి వరదలకు గూడు కోల్పోతున్న కుటుంబాలు
. నెలల తరబడి ఉపాధికి దూరం
. పట్టించుకోని పాలకులు… ఆందోళనలో బాధితులు
దశాబ్ద కాలంగా విలీన మండలాల సమస్య ఓ కొలిక్కి రాలేదు. ‘పోలవరం’తో నష్టపోతున్న కుటుంబాలకు పునరావాసం కల్పించి ప్యాకేజీ అందించాలని నిర్వహించిన సర్వే తప్పులతడకగా ఉండడంతో పరిహారం కోసం బాధితులు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారినా వారి తలరాతలు మారలేదు. మరోవైపు గోదావరి వరదలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగులుతున్నారు. పిల్లలు సైతం విద్యకు దూరమౌతున్నారు. ఇళ్లు వదిలి పునరావాస ప్రాంతాలకు తరలివెళ్లినా ఉపాధి కోసం అల్లాడుతూనే ఉన్నారు. పాలకులు పట్టించుకోకపోవడంతో జీవితాలు దీపావళి చీకట్లుగానే మిగులుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ‘కూటమి ప్రభుత్వం’లోనైనా కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న ఆశతో బాధిత కుటుంబాలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి.
విశాలాంధ్ర-వేలేరుపాడు: రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలలో కలిపారు. అవి విలీన మండలాలుగా పిలవబడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన ఏడు మండలాల్లో వేలాది కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయి. ఆయా కుటుంబాలను రెండు కాంటూర్ పరిధిగా విభజించారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల నిర్వాసిత కుటుంబాలకు జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం తదితర మండలాల్లో పునరావాసం కల్పిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణతో నష్టపోతున్న కుటుంబాలకు పునరావాసం కల్పించి ప్యాకేజీ అందించాలనే ఉద్దేశంతో 2017లో సర్వే నిర్వహించారు. ఆ తర్వాత ఆ సర్వేలో జరిగిన పొరపాట్లను సరిదిద్దటానికి మరికొన్ని సర్వేలు నిర్వహించారు. అయితే ఇప్పటికి సర్వేలో జరిగిన అవకతవకలను సరిజేయమని బాధితులు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాపతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ ప్రక్రియ మొదలుపెట్టి సుమారు పదేళ్లు కావస్తున్నా నష్టపోతున్న కుటుంబాల అంచనాపై నేటికీ స్పష్టత రాలేదు. బాధితులు, వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాయి. ప్రతి ఏడాది వర్షాకాలం వచ్చిందంటేనే ముంపు గ్రామాల ప్రజలకు భయం మొదలవుతుంది. గతంలో అనేకమార్లు గోదావరి వరదలు వచ్చినప్పటికీ 2022లో వచ్చిన వరద ఊహించని నష్టాన్ని చేకూర్చింది. దీంతో ముంపు ప్రాంత ప్రజలు గోదావరి వరద పెరుగుతుందంటేనే ఆందోళనకు గురవుతారు. శ్లు మునగటమే కాకుండా తాత్కాలిక పునరాస కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక, ఉపాధి లేక వారు నరకయాతన అనుభవిస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలు ఆ దగ్గరలోని మెరక ప్రాంతంలో తాత్కాలికంగా పరదాలతో గుడారాలు ఏర్పాటు చేసుకొని రోజుల తరబడి జీవించటం కష్టతరమవుతుంది. కనీసం మంచినీళ్లు కూడా సక్రమంగా అందని పరిస్థితి. ఆ బాధలు భరించలేని స్థితిలో కన్నతల్లి లాంటి ఊరును కూడా వదిలి వెళ్లిపోవటానికి సిద్ధమయి ప్రభుత్వాలను త్వరితగతిన పునరావాసం కల్పించమని వేడుకుంటున్నారు. గోదావరి వరదలకు నష్టపోతున్న తమకు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులుగా శాశ్వత పరిష్కారం చూపమని ముంపు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే వరదల వలన సర్వం కోల్పోయామన్న బాధను వ్యక్తపరుస్తున్నారు. ఏళ్ల తరబడి రెక్కల కష్టంపై కూడగట్టిన సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న నివాసం, వస్తు సామాగ్రి వరదల్లో కొట్టుకుపోయి కట్టుబట్టలతో మిగులుతున్నామని కన్నీటిపర్యంతమౌతున్నారు. వరదల వలన ఇల్లు ఖాళీ చేసి వెళ్లడానికి, ఇతర ప్రాంతాల్లో ఉండటానికి ఎంతో ఖర్చుతో పడుకున్నదని ఉపాధి లేని తమకు అది ఎంతో ఆర్థిక భారంగా మారుతుందని ఆవేదన చెందుతున్నారు. గోదావరి వరదల సమయంలో తాము పడుతున్న నరకయాతనను ప్రజా ప్రతినిధులు, అధికారులు కల్లారా చూస్తున్నారని, అయినప్పటికీ ప్రభుత్వం త్వరితగతన సమస్యను పరిష్కరించకపోవడం సమంజసం కాదని వాపోతున్నారు. ఇప్పటికైనా ముంపు గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా… గోదావరి వరద పెరగటం వలన గడిచిన కొద్దిరోజులుగా ముంపు గ్రామాల ప్రజలు పునరాస ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. వర్షాకాలం పూర్తయ్యే వరకు ఆ కాలనీలో ఉండి ఆ తర్వాత మళ్లీ వ్యవసాయ పనులకు సొంత గ్రామం వస్తుంటారు. పునరావాసం వద్దే ఉపాధి చూపించాలని దాని వలన కొత్త ప్రాంతంలోనే జీవనం సాగించే అవకాశం ఉంటుందంటున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని త్వరగా సమస్య పరిష్కరించాలని బాధిత ప్రజలు కోరుతున్నారు.


