–ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు బహుమతులు
–రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడాకారిణులకు ప్రత్యేక ప్రోత్సాహం
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు జడ్పీటీసీ దొరబాబు చేపడుతున్న కార్యక్రమం అభినందనీయమని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలుగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన స్వయంగా ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన వడ్ల రూపా సాయికి ప్రథమ బహుమతిగా రూ.5,016, అర్చనకు ద్వితీయ బహుమతిగా రూ.3,016, స్రవంతి, మహేష్ లకు తృతీయ బహుమతులుగా ఒక్కొక్కరికి రూ.2,016 చొప్పున జడ్పీటీసీ దొరబాబు అందజేశారు. అదే విధంగా జిల్లా పరిషత్ పాఠశాల నుంచి రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన వర్ష, ప్రభావతిలకు రూ.2,000 చొప్పున ప్రోత్సాహక నగదు అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ దొరబాబు మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నానని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగడంతో పాటు తోటి వారికి సహాయం చేసే గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు ప్రాణత్యాగాలు చేశారని, నేటి విద్యార్థులు దేశానికి సేవ చేయాలంటే మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. మంచి ఉద్యోగాలు సాధించి కన్న తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి వారిని గర్వపడేలా చేయాలని పిలుపునిచ్చారు. తన జడ్పీటీసీ పదవీకాలం ముగిసిన తర్వాత కూడా విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాన్ని కొనసాగిస్తానని దొరబాబు స్పష్టం చేశారు. భవిష్యత్తులో దాతల నుంచి ప్రోత్సాహకాలు అందకపోయినా తానే ముందుకొచ్చి విద్యార్థులకు బహుమతులు అందజేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వాలు విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలు, సౌకర్యాలు అందిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు తమ భవిష్యత్తును తామే తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు విజయకుమారి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


