Homeసంపాదకీయంఇరాన్‌తో శాంతి ఒప్పందం - అమెరికాకు అవమాన భారం

ఇరాన్‌తో శాంతి ఒప్పందం – అమెరికాకు అవమాన భారం

- Advertisement -

ఇరాన్‌ను లొంగదీయాలని, ధ్వంసం చేయాలని గత ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభించిన ఇస్రాయెల్, అమెరికా చివరకు అవమానకరమైన పరిస్థితిలో ఇరాన్‌తో శాంతి ఒప్పందం చేసు కోవలసి వచ్చింది. ఈ ఒప్పందం కుదిర్చింది పాకిస్థాన్ గనక విశ్వగురువు అని చెప్పుకుంటున్న భారత్ కూడా అవమానం భరించవలసి వచ్చింది. ఈ ఒప్పందంపై వచ్చే 19న స్విట్జర్లాండ్ లో రెండు పక్షాలూ సంతకం చేస్తాయట. “తీవ్రమైన చర్చలు జరిపిన తరవాత అమెరికాకు, ఇరాన్‌కు మధ్య యుద్ధ విరమణ ఒప్పందం కుదిరిందని ప్రకటించడానికి సంతోషిస్తున్నాం” అని పాకిస్థాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ప్రకటించారు. తక్షణమే అన్ని రంగాలలోనూ, లెబెనాన్లోనూ సైనిక చర్యలు నిలిపివేయడానికి రెండు పక్షాలు సమ్మతించాయని కూడా ఆయన ప్రకటించారు. యుద్ధం ఆగిపోవడం ఆహ్వానించాల్సిన పరిణామమే కానీ ఇది ఏకైక అగ్రరాజ్యమని విర్రవీగుతున్న అమెరికా చరిత్రలోనే భరించనలవి కాని అవమానం. ఇస్రాయెల్లోని హారీజ్ అనే పత్రిక “ఇది అయతుల్లా ఖొమేనికి సంపూర’ విజయం” అని రాసింది. ఈ యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచే ఈ యుద్ధంలో అమెరికా గెలవడం అసాధ్యం అని రూఢీ అవుతూనే ఉంది. యుద్ధం మొదలైన రోజే అమెరికా దాడుల్లో ఇరాన్ అగ్రనాయకుడు అయతుల్లా ఖొమేనీని హతమార్చారు. కానీ ఇరాన్ ఏమాత్రం చలించలేదు. అనూహ్యమైన పోరాట పటిమ ప్రదర్శించింది. అనేకమంది సీనియర్ సైనికాధికార్లు నేలకొరిగినా ఇరాన్ పోరాడుతూనే ఉంది. యుద్ధం మొదలైన తరవాత ఇరాన్ ప్రజలు విభేదాలన్నింటినీ పక్కనపెట్టి ప్రభుత్వానికి అచంచలమైన మద్దతు ప్రకటించినప్పుడే ఇరాన్ పరాజయం పాలయ్యే అవకాశమే లేదని, అమెరికా ఓటమి తప్పదని రుజువైంది. అయితే యుద్ధం ముగిసిందని లేదా వెంటనే ముగుస్తుందని అనుకోవడం కూడా తొందరపాటే కావొచ్చు. అంతిమ విజయం ఇరాన్దే అనడానికి ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇరాన్ ధాటికి తట్టుకోలేక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్యలో యుద్ధ విరామం ప్రస్తావన తీసుకొచ్చారు. అయినా అనేకసార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించారు. ఇటీవల కొన్నాళ్లు అమలైందంటున్న కాల్పుల విరమణ సమయంలో ఇస్రాయెల్ లెబెనాన్ మీద బాంబు దాడులు చేస్తూనే ఉంది. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం లెబెనాన్తో సహా అన్ని రంగాల్లోనూ కాల్పుల విరమణ కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అంటే ఇస్రాయెల్ ఆగడాలకు కళ్లెం వేయాల్సి వస్తుంది. ఇస్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహూ యుద్ధోన్మాదం ఏ స్థాయికి వెళ్లిందంటే కాల్పుల విరమణ అంటే నవ్వులాట కాదని ట్రంప్ గట్టిగానే చెప్పారు. లెబెనాన్ మీద దాడులు కొనసాగితే ధీటుగా సమాధానం చెప్తామని ఇరాన్ తీవ్రమైన హెచ్చరికే జారీ చేసింది. అంటే ఇస్రాయెల్ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకురావాల్సి వచ్చింది. లెబెనాన్ నుంచి ఇస్రాయెల్ తన సేనలను తొలగించాలని ఇస్రాయిల్కు ఇరాన్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. అమెరికా, ఇస్రాయెల్ భవిష్యత్తులో కూడా ఇరాన్ మీద దాడి చేయకూడదన్న ఇరాన్ షరతు కూడా అమెరికా అంగీకరించాల్సి వచ్చింది. ఇరాన్ షరతు పశ్చిమాసియా అంతటా శాంతిని పరిరక్షించడాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రతిపాదన. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇస్రాయెల్ మళ్లీ ఆగడాలకు పాల్పడదని నెతన్యాహూ తరఫున అమెరికా లిఖిత రూపంలో హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి హోర్ముజ్ జలసంధి పదేపదే ప్రస్తావనకు వస్తూనే ఉంది. నిజానికి యుద్ధం ప్రారంభమయ్యే దాకా ఇరాన్ హోర్ముజ్ జలసంధిని ఎప్పుడూ మూసేయలేదు. ఒక్కసారి ఈ జలసంధి మూసివేసిన తరవాత ప్రపంచమంతా సంక్షోభంలో కూరుకుపోయింది. ఎందుకంటే ప్రపంచ దేశాలు వాడే ముడి చమురులో 20 శాతం హోర్ముజ్ జలసంధి నుంచి రవాణా కావాల్సిందే. బూటకపు కాల్పుల విరమణ కొనసాగుతున్న సమయంలోనే అమెరికా హోర్ముజ్ జలసంధిని తెరిపించే నాటకం ఆడింది. కానీ విఫలం అయ్యింది. హోర్ముజ్ జలసంధిలో నిరాఘాటంగా నౌకల రాకపోకలు కొనసాగితే ఇరాన్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది. అంటే నిరాటంకంగా చమురు ఎగుమతి చేసి తమకు కావాల్సిన సరుకులు దిగుమతి చేసుకోగలుతుంది. ఇరాన్ మీద దాడి చేయడానికి ట్రంప్ చూపిన కారణం ఇరాన్ అణ్వస్త్రం తయారుచేస్తోందని వాదించడం. అమెరికా ఎప్పటినుంచో ఈ నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉంది. ఇరాన్‌లో యురేనియం శుద్ధి జరిగిన మాట వాస్తవమే కాని అది అణ్వస్త్రం తయారు చేయడానికి అనువైన స్థాయిలో లేదు. ఇరాన్ అణ్వస్ర్తాలు తయారుచేస్తోందన్న ఆరోపణతో అనేక ఏళ్ల నుంచి అమెరికా ఇరాన్ మీద అనేక ఆంక్షలు విధించింది. అణ్వస్త్రం తయారుచేయ కూడదని అయతుల్లా ఖొమేనీ ఫత్వా జారీ చేశారు. ఇరాన్ అణ్వస్త్రం తయారు చేయకుండా ఉన్నది ఈ ఫత్వా కారణంగా తప్ప అమెరికా బెదింపులకు లొంగి కాదు. తాము అణ్వస్త్రం తయారుచేసే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టంగా చెప్తోంది. అంటే తయారీలోనే లేని అణ్వg తయారీని ఇరాన్ ఇక ముందు కూడా తయారుచేయదన్న మాట. ఈ ప్రతిపాదనకు అంగీకరించడం వల్ల ఇరాన్‌కు కలిగే నష్టమేమీ ఉండదు. ఆంక్షలు తొలగించాలని, స్తంభింపచేసిన తమ నిధులను విడుదల చేయాలని ఇరాన్ మొదటి నుంచీ పట్టుబడ్తోంది. స్తంభింపచేసిన ఇరాన్ నిధులు దాదాపు 300బిలియన్ డాలర్లు ఉంటాయి. ఈ నిధులను విడుదల చేస్తే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఊహించలేని స్థితిలో ఎదుగుతుంది. అయితే ప్రస్తుతానికి 24బిలియన్ డాలర్లు విడుదల చేయడానికి ఒప్పందం కుదిరింది. ఇందులో తొలి విడతగా 12 బిలియన్ డాలర్లు తక్షణం విడుదల చేయాల్సి ఉంటుంది. ఇరాన్ మీద మౌలికమైన ఆంక్షలు తొలగించే అవకాశమే లేదని అమెరికా ఇనాళ్లూ బిగుసుకు కూర్చుంది. కావాలంటే గౌణమైన ఆంక్షలు తొలగిస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు మౌలికమైన ఆంక్షలు సైతం తొలగించక తప్పడం లేదు. అదీగాక 30 రోజుల్లోగా ఇరాన్ పరిసర ప్రాంతాల నుంచి అమెరికా సేనలను, యుద్ధ నౌకలను ఉపసంహరించుకోవలసి వస్తుంది. ఈ ఒప్పందం మీద వచ్చే శుక్రవారం ఒప్పందం మీద సంతకాలు జరిగితే ఒప్పందంలో పేర్కొన్న అంశాలు అమలు కావడానికి 60 రోజుల గడువు ఉంటుంది. అయితే పాకిస్థాన్ పనుపున జరుగుతున్న శాంతియత్నాల ప్రభావం వల్ల ముడి చమురు ధరలు పీపాకు వంద దాటిన స్థితి నుంచి సోమవారం 85డాలర్లకు పడిపోయాయి. అనుకున్నట్టుగా శాంతి కుదిరితే అంతర్జాతీయ ఆర్థికరంగం సంక్షోభ స్థితి నుంచి బయటపడవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు