Homeఉపరాష్ట్రపతి ఎన్నిక సైద్ధాంతిక పోరు

ఉపరాష్ట్రపతి ఎన్నిక సైద్ధాంతిక పోరు

- Advertisement -

రాజ్యసభ నిష్పాక్షిక పనితీరుకు జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి ఎన్నిక అవశ్యం
ఆయన నామినేషన్‌ ప్రతిపక్షాల ఐక్య సంకల్పానికి రూపం
‘ఇండియా’ భేటీలో మల్లికార్జున ఖడ్గే

న్యూదిల్లీ : ఉపరాష్ట్రపతి పదవి కోసం ఇండియా ఐక్య సంఘటన అభ్యర్థిగా జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి నామినేషన్‌ వేస్తుండటం ప్రతిపక్ష పార్టీల గౌరవం, నమ్మకానికి నిదర్శనమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే అన్నారు. రాజ్యసభలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని, ఈ పరిస్థితుల్లో జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి ఎన్నిక కీలకమన్నారు.‘ప్రతిపక్షాల గొంతు నొక్కే ధోరణి పార్లమెంటులో చూస్తున్నాం. కీలక అంశాలపై మమ్మల్ని మాట్లాడనివ్వడం లేదు. ఇలా తరుచూ జరుగుతోంది. పార్లమెంటులో అణచివేతను ప్రతిఘటించడం కోసం దేశానికి ఉత్తమమైన, నిష్పాక్షిక ఉప రాష్ట్రపతి అవసరం. ఈ పదవికి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి అన్ని విధాలా అర్హులు. భారతదేశాన్ని నిర్వచించే ప్రజాస్వామిక సిద్ధాంతాల పరిరక్షణకు ప్రతిపక్షాల ఐక్య సంకల్పాన్ని ప్రతిబింబింపజేసేదే సుదర్శన్‌ రెడ్డి నామినేషన్‌’ అని ఖడ్గే వక్కాణిం చారు. ప్రతి పౌరుడి ఔన్నత్యానికి, న్యాయానికి, రాజ్యాంగానికి కట్టుబడిన జీవితాన్ని జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి గడుపుతున్నారని అన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం నిర్భయంగా గళం వినిపించిన చాంపియన్‌ అంటూ అభివర్ణించారు. ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చే అనేక చారిత్రక తీర్పులను ఆయన వెలువరించారని ప్రశంసించారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక దేశం కోసం సైద్ధాంతిక పోరాటమని ఖడ్గే ఉద్ఘాటించారు. అధికార పార్టీ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం, సిద్ధాంతాలతో ముందుకెళుతుంటే ప్రతిపక్ష ఇండియాకు రాజ్యాంగం, దాని విలువులే మార్గదర్శకమన్నారు. రాజ్యసభ పనితీరు నిష్పాక్షింగా, హుందాగా, న్యాయంగా జరిపేందుకు కట్టుబడి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి నామినేషన్‌ వేస్తున్నారని తెలిపారు. న్యూదిల్లీ, సంవిధాన్‌ సదన్‌ సెంట్రల్‌ హాల్‌లో బుధవారం ఇండియా సభ్యులు సమావేశమయ్యారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు. ఆయనకు ఖడ్గే సహా ఇండియా ప్రముఖ నాయకులు సన్మానించారు. ఖడ్గే ప్రసంగిస్తూ 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో కేంద్రం ఉందన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం విలువలను నీరుగార్చే ఈ బిల్లును చివర్లో సభ ముందర ఉంచబోతోందని అన్నారు. ప్రజాస్వామిక వ్వయస్థల సమగ్రత సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో న్యాయానికి, నిష్పాక్షికతకు, రాజ్యసభ ఔన్నత్యానికి కట్టుబడాలనే సంకల్పమే సుదర్శన్‌ రెడ్డి నామినేషన్‌ అని ఖడ్గే తేల్చిచెప్పారు. ఆయనకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణకు హామీ ఇవ్వాలని ప్రతి పార్లమెంటు సభ్యునికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు