సీఈసీ జ్ఞానేశ్ను తక్షణం తొలగించాలి కరవును జాతీయ విపత్తుగా ప్రకటించి… రైతాంగాన్ని ఆదుకోవాలి
- డిసెంబరులో జైల్ భరో – సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ
- కరవు సమస్య చంద్రబాబుకు పట్టదా? : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య
విశాలాంధ్ర`కడప బ్యూరో : కేంద్రంలోని ఎన్‌డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో రైతాంగం, ఉద్యోగులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు సీపీఐ రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. మంగళవారం కడపలోని బీసీ భవనంలో జరుగు తున్న పార్టీ రాష్ట్ర సమితి సమావేశాలకు సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ… ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని కోల్పోయి కేంద్రానికి తొత్తుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) పేరుతో ఇప్పటికే దేశ వ్యాప్తంగా 13.54 కోట్ల ఓట్లు చోరీకి గురయ్యాయని తెలిపారు. బీజేపీ చెప్పిందే చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణం విధుల నుంచి తొలగించాలని, లేనిపక్షంలో డిసెంబరులో దేశ వ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా కరవు విలయతాండవం చేస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1970 సంవత్సరంలో కరవు సంభవించిందని, దానికి మించిన కరవు ఇప్పుడు చూస్తున్నామని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సీపీఐ బృందం… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి రాష్ట్రంలో దాదాపు 520 మండలాల్లో కరవు తాండవిస్తోందని తక్షణం స్పందించాలని సూచించామని తెలిపారు. కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో వామపక్షాలతో పాటు మిగిలిన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నాయకులతో సంప్రదింపులు చేసినట్లు చెప్పారు. కరవు పరిస్థితులపై అక్టోబరు 2 న అమరావతిలో సమావేశం జరుగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలోని కరవు పరిస్థితులపై ప్లీనరీ సమావేశాల్లో చర్చించి ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటాలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. పశుగ్రాసం లేక రైతులు పశు సంపదను అతి తక్కువ ధరకు కబేళాలకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొంటే విజనరీ అయిన సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు అవుతున్నా ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయిందని విమర్శించారు. అధికార దర్పంతో ప్రభుత్వంలోని ఈడీ, సీబీఐ, చివరకు జ్యుడీషియల్ సంస్థలను తమ ఆధీనంలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు. బుధవారం దిల్లీలో 5 వామపక్ష పార్టీలతో పాటు ఇండియా కూటమిలోని అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి సీఈసీని తొలగింపునకు యుద్ధభేరి మోగిస్తామని, అదే సమయంలో సీఈసీ పైన సుప్రీం కోర్టు సుమోటోగా కేసును తీసుకోవాలని ఆయన కోరారు. గతంలో ప్రశ్న పత్రాలతో లీక్‌లతో దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధ్వర్యంలో జరిగిన ఉద్యమానికి అప్పటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, సీఈసీ పైనా దిల్లీలో అదే విధంగా అన్ని పార్టీలతో కలుపుకొని పోయి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలిపారు. కరవు, ఓటు చోరీపై సీపీఐ చేస్తున్న ఉద్యమాలను ఆపడమూ ఎవరితరమూ కాదని ఆయన అన్నారు. డిసెంబరు 2, 3, 4 తేదీలలో జైల్భరోతో ఉధృత పోరాటం సాగిస్తామన్నారు. ప్రస్తుతం సీఈసీకి మిగిలిన ఇద్దరు అధికారులు 14 సార్లు ఫిర్యాదు చేసినా పెడచెవిన పెట్టిన విషయం చంద్రబాబుకు తెలియదా అని రామకృష్ణ ప్రశ్నించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో సహా ముగ్గురూ కలిసి విలేకరుల సమావేశం పెట్టినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదని, ఎన్నికల సంఘంపై జాతీయ స్థాయిలో ఉద్యమం ఉధృతం అవుతుందని, దీనిని ఆపడం చంద్రబాబు తరం కూడా కాదని తెలిపారు. డీఎస్‌సీలో అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడం శుభపరిణామమే అయినా స్పోర్ట్స్ కోటా కింద అవకతవకలు జరిగాయనే అపవాదును రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించుకొని నిజాయితీ చాటుకోవాలని అన్నారు.
కరవు నుంచి రైతులు… కూలీలను ఆదుకోవాలి : ఈశ్వరయ్య
దేశంలో ఓ పక్క ప్రధాన ఎన్నికల అధికారి సమస్య, మరోవైపు రాష్ట్రంలో కరవు కరాళ నృత్యం చేస్తున్నప్పటికీ విజనరీ అయిన సీఎం చంద్రబాబు ఈ సమస్యలను గాలికి వదిలి వేసి ప్రచార్భాటానికి ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. కరవును జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం చేసి రైతులను, వ్యవసాయ కూలీలను, కార్మికులను ఆదుకోవాలని, అలాగే ప్రజలు వలసలు వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 518 మండలాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా కరవు నెలకొనడంతో చిన్న, సన్నకారు రైతులు కుదేలయ్యారని తెలిపారు. సమస్యాత్మక సెక్షన్ 22(ఎ) లో ఉన్న భూములను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని విమర్శించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లుగానీ, మండల స్థాయిలో తహసీల్దార్ కూడా వీటిపై తగిన చర్యలు తీసుకోకపోవడంతో రాష్ట్రంలో 40 లక్షల మంది ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ సమస్యపై తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈశ్వరయ్య హెచ్చరించారు. ఈ రాష్ట్ర సమితి సమావేశాల్లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, అక్కినేని వనజ పాల్గొన్నారు. ప్రారంభంలో ఇటీవల మరణించిన పార్టీ శ్రేణులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కేవీవీ ప్రసాద్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, సమితి సభ్యులు పాల్గొన్నారు.


