. అర్హత గల ప్రతి ఓటరు నమోదు కావాలి
. టీడీపీ వర్క్‌షాపులో సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఓటర్ల జాబితా ప్రక్షాళన (ఎసఐఆర్) ప్రక్రియను తీవ్రంగా పరిగణించాలని, అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో నమోదు కావాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఎసఐఆర్‌పై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జోనల్ సమన్వయకర్తలు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పరిశీలకులు, బీఎలఏలు హాజరయ్యారు. వారికి ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ఓటర్ల జాబితాలు ఆధారంగా ఎన్నికల వ్యూహాలు, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎసఐఆర్ ప్రక్రియపై రాష్ట్రం నుంచి గ్రామీణ స్థాయి వరకు నాయకుల అవగాహన పెంచుకోవాలని, దీనిపై పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 20-25 ఏళ్లకోసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందని గుర్తుచేశారు. ‘2002 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకుని ఎసఐఆర్ చేపడుతున్నారు. జులై 14 లోగా రెండుసార్లు ఓట్ల మ్యాపింగ్ చేస్తారు. ఈలోగా ఓట్ల చేరికలు పూర్తి కావాలి. అవసరమైతే మÖడోసారి కూడా ఇళ్లకు వెళ్లి ఓట్ల పరిశీలన జరపాలి’ అని సీఎం సూచించారు. ఎసఐఆర్ పర్యవేక్షణలో సమన్వయంతో ముందుకెళ్లాలని కూటమి పార్టీలను కోరారు.
రెండేళ్ల పాలనపై 25 నుంచి
సైకిళ్లతో ప్రచారం
ఈనెల 25 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు 45 రోజుల పాటు ఇంటింటి ప్రచారం చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. రెండేళ్లల్లో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని, ఇంటింటి ప్రచారంలో తాను పాల్గొంటానని చెప్పారు. సైకిళ్ల మీద వెళ్లి ప్రజలను కలవాలి… వీలుంటే ఈ-సైకిళ్లపై ప్రచారం చేపట్టాలని సూచించారు. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సామెతను గుర్తు చేస్తూ గొడ్డలి పార్టీ విషయంలో ఇది వర్తిస్తుందని చంద్రబాబు అన్నారు. ఆ పార్టీ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కొత్తగా ఎమ్మెల్యేలు వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదని, మళ్లీ మళ్లీ గెలవాలని హితవు పలికారు. అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా ప్రతినిధుల వ్యవహార శైలి ద్వారా ఓట్లు పెరుగుతాయి.. తగ్గుతాయని చంద్రబాబు అన్నారు.
ప్రజల కోసం పనిచేసి నోరు అదుపులో పెట్టుకోకుంటే నష్టమే అని హెచ్చరించారు. కార్యకర్త మొదలుకుని నాయకుడి వరకు ప్రతి ఒక్కరికీ మంచి వ్యక్తిత్వం, నమ్మే స్వభావం చాలా ముఖ్యమని చంద్రబాబు వెల్లడించారు.


