న్యూదిల్లీ: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు వీలుగా రాష్ట్రపతి భవన్ ఉప రాష్ట్రపతి రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖకు పంపింది. అనంతరం దీనిని హోం శాఖ నోటిఫై చేసి ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని రాజ్యసభకు తెలిపింది. 12గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే సభను నిర్వహిస్తున్న ఘనశ్యామ్ తివారీ నోటిఫికేషన్‌పై సభ్యలకు వివరించారు.
ధన్కర్ ఆరోగ్యంగా ఉండాలి: మోదీ
ఇదిలాఉండగా జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టారు. ధన్కర్ దేశానికి అనేక సేవలందించారని, ఉపరాష్ట్రపతిగా మాత్రమే కాక ఇతర అనేక పదవుల ద్వారా సేవలందించారని కొనియాడారు.
జేఎన్‌యూ ప్రసంగంలో ధన్కర్ కీలక వ్యాఖ్యలు
రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈ నెల 10వ తేదీన జేఎన్‌యూలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ… 2027 ఆగస్టులో సరైన సమయంలో పదవీ విరమణ చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే అది దైవ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. కానీ ఆ మాటలన్న 11 రోజులకే అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రాజీనామా లేఖ పంపారు. వైద్యుల సూచనల మేరకు ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ)కు అనుగుణంగా ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ధన్కర్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం
- Advertisement -
RELATED ARTICLES


