Homeవిశ్లేషణపంజాబ్లో బీజేపీ కొత్త ఎత్తుగడ

పంజాబ్లో బీజేపీ కొత్త ఎత్తుగడ

- Advertisement -

డా.అరుణ్ మిత్ర

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల పొత్తులపై ఇప్పుడిప్పుడే చర్చలు ఊపందుకుంటున్నాయి. కేంద్రంలోని ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘం ద్వారా ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలుచేసిన ఈ ప్రక్రియ తమకు రాజకీయ ప్రయోజనాన్ని చేకూర్చడంతో పంజాబ్లో కూడా ఇలాంటి వ్యూహాన్ని అమలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే హిందూ-ముస్లిం విభజన ఆధారంగా ఓట్లను సమీకరించే వ్యూహం ఇతర రాష్ట్రాల్లో సక్సెస్ ఐనట్లు పంజాబ్లో ఆశించిన ఫలితాలు ఇవ్వదని బీజేపీ గుర్తించింది. అందుకే కొత్త ఎత్తుగడ వేసింది. మాలేర్కోట్లా జిల్లాలోనే ముస్లింలు ఎక్కువగా నివసిస్తారు. లూధియానా వంటి పారిశ్రామిక నగరాల్లో వ్యవసాయ రంగంలో పనిచేసే ముస్లిం వలస కార్మికులు కనిపిస్తారు. అందువల్ల బీజేపీ పంజాబ్లో మరో రాజకీయ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. పంజాబ్లో సింహ భాగం సిక్కులు ఉంటారు. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత వ్యాపారాల్లో ప్రధానంగా కనిపిస్తారు. పట్టణ ప్రాంతాల్లో సిక్కులకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఉంది. మరోవైపు, హిందువులు ప్రధానంగా పట్టణాలు, నగరాల్లో నివసిస్తూ వ్యాపార, వాణిజ్య రంగాల్లో చురుకుగా పాల్గొంటారు. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి దశాబ్దాలుగా స్థిరపడిన ఎన్నో కుటుంబాలు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. అలాగే అనేక మతపరమైన డేరాలు, ఆధ్యాత్మిక సంస్థలు సమాజంలోని వివిధ వర్గాలపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఈ వాస్తవాన్ని గుర్తించిన బీజేపీ, ఈ మత సంస్థలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం కోసం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ గురు రవిదాస్ జయంతి సందర్భంగా జలంధర్‌లోని డేరా సచ్ఖండ్ బల్లాన్ను సందర్శించారు. అక్కడ ఆయన నివాళులర్పించి, డేరా ఆధ్యాత్మిక అధిపతి సంత్ నిరంజన్ దాస్‌ను కలిశారు. ప్రధాని పర్యటనకు ముందు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, మాజీ కేంద్ర మంత్రి విజయ్ సంప్లా, బీజేపీ నాయకుడు అవినాష్ చంద్ర వంటి వాళ్లు కూడా డేరాను సందర్శించడం గమనార్హం. అలాగే హర్యానా సీఎం నాయక్ సింగ్ సైనీ, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు కేవల్ సింగ్ ధిల్లాన్ , బియాస్‌లోని రాధాస్వామి సత్సంగ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ వారు సంస్థ అధిపతి బాబా గురిందర్ సింగ్ ధిల్లాన్ను కలిసి ఆశీర్వాదాలు అందుకోవడమే కాకుండా ఆధ్యాత్మిక, సామాజిక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ విధంగా బీజేపీ పట్టు సాధించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. డేరా సచ్చా సౌదా ప్రధాన కేంద్రం హర్యానాలో ఉన్నప్పటికీ, పంజాబ్లో కూడా దానికి విస్తృతమైన అనుచర వర్గం ఉంది. ఆ సంస్థ అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నప్పటికీ, అతని ప్రభావం ఇంకా కొనసాగుతోంది. అతనికి తరచూ లభిస్తున్న పెరోళ్లు రాజకీయ వివాదాలకు దారి తీస్తున్నాయి. ఎన్నికల సమయంలో అతని ప్రభావాన్ని రాజకీయంగా వినియోగించుకుంటున్నారని అభిప్రాయం అనేక వర్గాల్లో ఉంది. ఇటీవల బీజేపీ తన వ్యూహంలో కొత్త కోణం కనిపిస్తోంది. సాధారణంగా ఆర్‌ఎస్‌ఎస్ ఒక ఆలోచనను ముందు ప్రజల్లోకి వదులుతుంది. వారి స్పందన గమనించాకే దాన్ని ముందుకు తీసుకెళ్లే విధానాన్ని రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ జూన్ 6న మెహతా చౌక్‌లోని దమ్దమీ టకాస్ల్ కేంద్రంలో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్ స్మారక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆయన భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాడిన వారిని “అమరవీరులు” గా అభివర్ణించారు. ఇదే సమయంలో, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి స్వర’ దేవాలయంపై సైనిక చర్య చేపట్టాలని బీజేపీ నేత ఎల్కె.అద్వానీ ఒత్తిడి తెచ్చారన్న విషయం కూడా బహిరంగ చర్చల్లో తరచూ ప్రస్తావనకు వస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఒక ప్రముఖ మతస్థలంపై సాయుధ చర్య జరిగితే అది వివాదాస్పదమవడం సహజం. ఎందుకంటే ఆ స్థలాలతో ప్రజల భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. గిరీష్ మహాజన్ తన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను అహ్మద్ షా అబ్దాలీతో పోల్చారు. ఇందిరాగాంధీ హత్య అనంతరం దిల్లీతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో జరిగిన సిక్‌కు వ్యతిరేక హింసలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు పోషించిన పాత్ర తీవ్ర విమర్శలకు గురైంది. అయితే ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలలో కొందరు సిక్‌కు వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేశారన్న అంశం చర్చకు రాలేదు. మహాజన్ తన ప్రసంగంలో ఆపరేషన్ బ్లాక్ థండర్ గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. స్వర’ దేవాలయ సముదాయం నుంచి సాయుధ మిలిటెంట్లను తొలగించేందుకు బ్లాక్ థండర్‌ని రెండు దశల్లో నిర్వహించారు. మొదటి దశ 1986 ఏప్రిల్ 30న ప్రారంభమై మే 1న ముగిసింది. రెండో దశ 1988 మే 9న ప్రారంభమై మే 18న మిలిటెంట్ల లొంగుబాటుతో ముగిసింది. ఆపరేషన్ బ్లూ స్టార్‌తో పోలిస్తే బ్లాక్ థండర్ భిన్నమైన విధానంలో జరిగింది. ఇందులో ప్రధానంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్, పంజాబ్ పోలీసులు పాల్గొన్నారు. పౌరుల ప్రాణనష్టం తగ్గించడం, గురుద్వారాకు నష్టం కలగకుండా చూడడం ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకున్నారు. మొదటి దశలో ముఖ్యమంత్రి సుర్జిత్ సింగ్ బర్నాలా కేంద్ర సహాయం కోరగా, రెండో దశ సమయానికి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉంది. బీజేపీ జాతీయ నాయకత్వం శిరోమణి అకాలిదళ్తో ఎన్నికల పొత్తు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే ఈ రాజకీయ పరిణామాల్లో కొన్ని వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. అకాలీ దళ్, దమ్దమీ టకాస్ల్కి చరిత్రపరంగా ఒకే రకమైన రాజకీయ అభిప్రాయాలు లేవు . పంజాబ్లో ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న కాలంలో దమ్దమీ టకాస్ల్ కీలక పాత్ర పోషించింది. ఖలిస్తాన్ ఉద్యమం, వేర్పాటువాద భావజాలంతో కూడా దానికి అనుబంధం ఉంది. అకాలీదళ్ హింసను, వేర్పాటువాదాన్ని బహిరంగంగా సమర్థించకపోయినా, గట్టిగా వ్యతిరేకించలేదనే విమర్శలు ఉన్నాయి. మత ఆధారిత రాజకీయాలు చేసే పార్టీగా అకాలీదళ్ లౌకికవాదంపై తరచూ ప్రశ్నలు తలెత్తాయి. సిక్కులపై వివక్ష జరుగుతోందని అకాలీ నాయకులు ప్రచారం చేశారు. కొన్ని సందర్భాల్లో భారత రాజ్యాంగ ప్రతులను చింపేసీ నిరసనలు చేపట్టారు. ఇవి అప్పటి రాజకీయ వాతావరణంపై ప్రభావం చూపాయి. భవిష్యత్తులో అకాలీలతో పొత్తు ఏర్పడితే అందులో తాము ఆధిపత్యస్థానంలో ఉండొచ్చని బీజేపీ భావించి ఉండవచ్చు. అయితే ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చూస్తే అది అంత సులభం కాదని తెలుస్తోంది. ఎందుకంటే సిక్‌కు ఓట్ల కోసం ఇప్పుడు అనేక సంస్థలు పోటీ పడుతున్నాయి. అలాంటి కొత్త శక్తుల్లో “వారిస్ పంజాబ్ దే” ఒకటి. ప్రస్తుతం దీనికి ఎంపీ, మత ప్రబోధకుడు అమృత్పాల్ సింగ్ నాయకత్వం వహిస్తున్నారు. వ్యవస్థాపకుడు దీప్ సిద్ధూ మరణం తర్వాత ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. అమృత్పాల్ ఎదుగుదలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరోక్షంగా సహకరించిందని కొందరు విమర్శకులు అంటున్నారు. దీప్ సిద్ధూకు ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న సాన్నిహిత్యం కూడా ఈ చర్చలకు కారణమైంది. పంజాబ్లో మతపరమైన విభజనలను పెంచే ప్రయత్నాలు గతంలోనూ జరిగాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఉగ్రవాద కాలంలో కొన్ని శాంతి కమిటీల సమావేశాల్లో బీజేపీ నాయకుల ప్రసంగాలు సామరస్యాన్ని పెంచడం కంటే మతపరమైన విభేదాలను మరింత బలపరిచాయని విమర్శలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో పంజాబ్లో బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలను జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. సీపీఐ మాత్రం వేర్పాటువాదాన్నీ, ఉగ్రవాదాన్నీ నిరంతరం వ్యతిరేకించింది. ఈ పోరాటంలో ఆ పార్టీకి చెందిన అనేక మంది కార్యకర్తలు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ సమయంలో “నా హిందూ రాజ్, నా ఖలిస్తాన్ యుగయుగాలూ వర్ధిల్లాలి హిందుస్తాన్” అనే నినాదం విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. పంజాబ్లో బీజేపీ రాజకీయ విస్తరణను అడ్డుకోగలిగితే అది ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. అయితే అలాంటి ఫలితం రావాలంటే విస్తృత స్థాయిలో ప్రజలను సమీకరించే ప్రయత్నాలు చేయాలి. రాజకీయ సమీకరణలు మార్చాలి. సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్లాలి. 1980 లతో పోలిస్తే సంస్థాగతంగా వామపక్షాల బలం తగ్గినప్పటికీ, వాటి భావజాల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. వామపక్షాలకు కార్మికులు, వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతుల బలమైన మద్దతు ఉంది. ఇతర పార్టీలు మత రాజకీయాలు చేస్తుంటే వామపక్షాలు ప్రజల జీవన సమస్యలపై దృష్టి పెడుతున్నాయి. వేతనాలు, గిట్టుబాటు ధరలు, విద్య, వైద్యం, ఉపాధి, మహిళల హక్కులు వంటి అంశాలను ముందుకు తీసుకువస్తున్నాయి. ప్రజల సమస్యలే రాజకీయ చర్చల్లో ప్రధానంగా ఉండాలి. మతతత్వ, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా వామపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాద శక్తులు కలిసి విస్తృత ఐక్య వేదికను నిర్మించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజాకేంద్రిత రాజకీయాలకు బలం చేకూరుతుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు