- సంక్షేమానికి`సంక్షోభానికి వ్యత్యాసం చూసి దీవించండి
- డబులింజన్ పాలనతో వేగవంతమైన అభివృద్ధి
- ఉదయగిరి పల్లె పండుగ 3.0 బహిరంగ సభలో చంద్రబాబు
- రూ.11,085 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
విశాలాంధ్ర బ్యూరో – నెల్లూరు : ప్రజలకు సేవ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, తాము ప్రజలకు సేవకులమే తప్ప పెత్తందార్లం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఉదయగిరి నియోజకవర్గం వరికుంటంపాడు మండలం రామాపురం గ్రామంలో మంగళవారం నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి… ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి రూ.11,085 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,700 కోట్లతో 6 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, రూ.7,550 కోట్లతో 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే పాడి రైతుల కోసం రూ.300 కోట్లతో 22 వేల మినీ గోకులాలు నిర్మాణం, రూ.225 కోట్లతో 50 వేల ఎకరాల్లో ఉద్యాన తోటల పెంపకానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, రూ.110 కోట్లతో వెయ్యి కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… పల్లెల్లో అభివృద్ధి పనులకు పల్లె పండుగ ద్వారా నాంది పలుకుతున్నామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో రూ. 50 వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామని, ఇప్పుడు పల్లెల్లోనూ కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని సీఎం వెల్లడించారు. ప్రజల కళ్లకు కనబడేలా అభివృద్ధి చేస్తున్నామని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే అంశంపై దృష్టి పెట్టామన్నారు. గోకులం షెడ్లు, మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మిస్తున్నామని, ప్రతి ఒక్కరికీ ఇల్లు… ఇంటి స్థలం, విద్యుత్, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు చేసేలా కృషి చేస్తున్నామని తెలిపారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రకు గ్రామాలే నాంది పలకాలని సూచించారు. చెత్త నుంచి సంపద సృష్టించే వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నామని, పేదరికం లేని గ్రామాలను తీర్చిదిద్దేందుకు… ఆర్థిక అసమానతలు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ నాయకత్వంలో ఇప్పటికే మూడు పల్లె పండుగ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఉద్యమ స్ఫూర్తితో పవన్ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని, పల్లె వికాసంలో ఆయన తనదైన ముద్ర వేశారని చంద్రబాబు అభినందించారు. పంచాయతీరాజ్ శాఖకు 13 జాతీయ అవార్డులు రావడం అభినందనీయమన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు వేసిన ఓటు వృథా కాలేదని, ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి అన్నారు. చెప్పిన విధంగానే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రెండేళ్లలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని, జెట్ స్పీడ్‌తో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. సంక్షేమం-అభివృద్ధి-సుపరిపాలనే ఎన్డీయే ప్రభుత్వ మంత్రమని పేర్కొన్నారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి, సామాజిక పింఛన్లు, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. సంక్షేమానికి, గత ప్రభుత్వంలో సంక్షోభానికి వ్యత్యాసాన్ని ప్రజలు గమనించి తమకు అండగా నిలవాలని కోరారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత ప్రభుత్వానిదైతే… ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రజలదని సీఎం చెప్పారు.
నిర్వీర్యమైన వ్యవస్థలకు ప్రాణం పోశాం: పవన్ కల్యాణ్
గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన పంచాయతీ వ్యవస్థలకు మళ్లీ ప్రాణం పోసి, గ్రామ స్వరాజ్యాన్ని సాధించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శ్రీకృష్ణదేవరాయలు పాలించిన ఘనమైన చారిత్రక నేపథ్యం ఉన్న ఉదయగిరి ప్రాంతం నుంచి నేటికీ ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం బాధాకరమని, ఆ వలసలను అరికట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నిలపాలనే సంకల్పంతోనే ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినట్లు వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేయడానికి కూడా నిధులు లేని దయనీయ పరిస్థితి ఉండేదని విమర్శించారు. అప్పలపాలై దివాళా తీసిన రాష్ట్రాన్ని అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతంగా గాడిలో పెట్టి, ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని ప్రశంసించారు. కాగా, కాకొల్లువారిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ శ్రమదానం చేశారు. శ్రామికుల వద్దకు వెళ్లి పొలాల మధ్య డొంక రోడ్డు పనులను ప్రారంభించారు. కాలినడకన పల్లెపండుగ అభివృద్ధి పనుల పరిశీలించి, గ్రామ సచివాలయం వద్ద ‘వీబీ జీ రామ్ జీ’ శ్రామికులతో కలసి గ్రూప్ ఫొటో దిగారు. మంత్రులు నారాయణ, ఆనం రామ్ నారాయణ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్ధన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


