కేవీవీ ప్రసాద్
విశాలాంధ్ర`బేస్తవారిపేట : ప్రస్తుతం ఎరువులు, పురుగు మందుల వాడకం పెరిగిపోయిందని, ప్రకృతి సేద్యం చేసేలా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉందని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం రాష్ట కార్యదర్శి కేవీ ప్రసాద్ తెలిపారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన రైతు సంఘ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతులు అనేక రకాల పంటలు పండించినప్పటికీ సరైన మద్దతు ధర లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల కాలంలో ఏ పంటకు కూడా మద్దతు ధర లభించని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. పంటలకు సరైన మద్దతు ధరలు లభించక ప్రతి సంవత్సరం రూ.3 లక్షల కోట్లు నష్టపోవాల్సిన పరిస్థితి అని అన్నారు. దానికి తోడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్ప్పుడు సరైన పంటల బీమా పథకం అమలు కావడం లేదని తెలిపారు. గతంలో పంటల బీమా పథకం ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించేదని, కాననీ ప్రస్తుత కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ప్రీమియంను రైతులే భరించాలన్న ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనివల్ల ప్రీమియం నిర్వహించే కంపెనీలకు ఆదాయం లభిస్తుందే కానీ రైతులకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా, ఎరువులు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రాకముందు స్వామినాథన్ సిఫారసులను అమలు చేసి… రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిందని, కానీ రెట్టింపు కాకపోగా ప్రతి ఏటా ఆదాయం తగ్గిపోయే పరిస్థితి దాపురించిందన్నారు. ఫిబ్రవరి 1 న ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, అత్యధిక నిధులు కేటాయించాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రం కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేలా కొత్త చట్టాలను తీసుకురావడం దుర్మార్గమని, ఉపాధి హామీ పేరు మార్పు శోచనీయమని అన్నారు. పశుసంవర్ధక మాజీ శాఖాధికారి ఒ.నరసింహారావు, ఆంధ్ర ప్రదేశ్ ప్రత్తి రైతు సంఘం రాష్ట కార్యదర్శి డి.శ్రీనివాస్, గిద్దలూరు నియోజకవర్గ రైతు సంఘం కార్యదర్శి ఢాకాల పుల్లయ్య, రైతు సంఘం అధ్యక్షులు జె.అంకయ్య, సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఊరుమార్పు జోసెఫ్, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి ఆర్.యోగయ్య సీపీఐ మోక్షగుండం శాఖ కార్యదర్శి ఎం.వి.కొండయ్య, ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది డి. తిరుమల నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతి సేద్యం వైపు రైతులను ప్రోత్సహించాలి
- Advertisement -
RELATED ARTICLES


