Homeవిశ్లేషణప్రకృతిని ధిక్కరిస్తే విపత్తే

ప్రకృతిని ధిక్కరిస్తే విపత్తే

- Advertisement -

డా॥ సోమ మర్ల

నేపాల్ విపత్తు తీవ్రత ఊహించలేనంతగా ఉంది. ఇప్పటివరకు దాదాపు 1,200 మంది మరణించగా, వేలాది మంది బురదలో చిక్కుకుని గల్లంతయ్యారు. చైనా, నేపాల్‌లో డజన్ల కొద్దీ ఉన్న చిన్న చిన్న గ్రామాలు భౌగోళిక పటంలోనే కనిపించకుండాపోయాయి. పర్వత ప్రాంతాల్లో వరుసగా చోటుచేసుకున్న ప్రకృతి వైపరీత్యాలు, హిమానీనదాలు విరిగిపడటం, భారీగా కొండచరియలు కూలిపోవడం వంటి ఘటనల వలన ల్హెండే నది ప్రవాహ మార్గం టిబెట్ వైపు మళ్లింది. ఫలితంగా నేపాల్‌లోని భోటే కోసి, త్రిశూలి నదుల్లోకి భారీ మొత్తంలో మంచు, రాళ్లు, బురద, మట్టి, శిథిలాలు కొట్టుకొచ్చాయి. ఐతే ఇక్కడ ప్రస్తుత పరిస్థితి దారుణంగా మారింది. పర్యావరణ పరిమితులను పట్టించు కోకుండా రహదారులు, జలవిద్యుత్ ప్రాజెక్టులు, పర్యాటక మౌలిక వసతులు, నివాస ప్రాంతాలను విస్తరించడం భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్, వయనాడ్ (కేరళం), పాకిస్థాన్, నేపాల్లలో సంభవించిన వినాశకరమైన వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులు ప్రకృతి వైపరీత్యాలు మాత్రమే కావు, మానవ తప్పిదాల వల్ల సంభవించిన సంక్షోభాలు. ఈ సంఘటనలు ప్రస్తుత మనం అనుసరిస్తున్న పర్యావరణ వ్యతిరేక అభివృద్ధి నమూనాలోని లోపాలను స్పష్టం చేస్తున్నాయి.
పర్వతాలను మార్చేస్తున్న అభివృద్ధి : కొన్ని దశాబ్దాలుగా పర్వతాల వాలు మీదుగా రహదారులను నిర్మించడం మొదలుపెట్టారు. జలవిద్యుత్ ఉత్పత్తి కోసం ఆనకట్టలు కట్టారు. లోయల వెంట హోటళ్లు, రిసార్టులు, పర్యాటక సదుపాయాలు విస్తరించాయి. విద్యుత్ ప్రాజెక్టుల వెంట ట్రాన్స్‌మిషన్ లైన్‌లు ఏర్పడ్డాయి. కొత్తగా రహదారి, విద్యుత్ సౌకర్యాలు వచ్చిన ప్రాంతాల్లో నివాసాలు, ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. ఇవి ఉపాధి, ఆదాయం, విద్యుత్, రవాణా వంటి అవకాశాలను పెంచినప్పటికీ, పర్వతాల పర్యావరణ వ్యవస్థను సమూలంగా మార్చేశాయి. నదుల ప్రవాహానికి స్థలం లేకుండా పోయింది. కొండ వాలును పటిష్టంగా ఉంచేందుకు చెట్లు, వృక్షసంపద అవసరం. అప్పుడే అడవులు, చిత్తడి నేలలు వర్షపు నీటిని గ్రహించి, నేలకోతను తగ్గిస్తాయి. ఐతే ఇలాంటి సహజ వ్యవస్థలు నాశనమైపోయిన కారణంగా అక్కడి పర్వత భూభాగం బలహీనంగా మారింది. భారీ వర్షాలు, వరదలు, హిమానీనదాల విరిగిపడటం వంటి ప్రకృతి ప్రక్రియలను తట్టుకునే సామర్థ్యం తగ్గిపోయింది. ఫలితంగా ప్రకృతి కన్నెర్రజేసింది.
వాతావరణ మార్పుతో ముప్పు : ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడం, హిమానీనదాలు కరగడం, వర్షపాతంలో మార్పులు చోటుచేసుకోవడం వల్ల ఆకస్మిక వరదలు, హిమానీనద సరస్సులు ఉప్పొంగి వచ్చే వరదలు, కొండచరియలు విరిగిపడి విపత్తులు పెరిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, హిమాలయ ప్రాంత ప్రజలు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. నదుల సహజ ప్రవాహ మార్గాలను మార్చేసి వాటి పరివాహక ప్రాంతాన్ని కుదించేస్తుండడం వలన ప్రమాదం పెరుగుతోంది. అంతర్జాతీయ సమగ్ర పర్వత్ఙాó వృద్ధి కేంద్రం నివేదికల ప్రకారం, హిందూకుష్-హిమాలయ ప్రాంతం లోని హిమానీనదాలు అంతకుముందు దశాబ్దంతో పోలిస్తే 65శాతం కరిగిపోయాయి.
హిమాలయాల్లో భారీ ప్రాజెక్టుల విస్తరణ : భారత్, చైనా, నేపాల్ హిమాలయాల్లో ఎత్లైన ప్రాంతాల్లో జలవిద్యుత్, రహదారులు, రైల్వేలు, సొరంగాల వంటి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులను వేగంగా చేపడుతున్నాయి. భారత్ జోజిలా సొరంగం, శింలా ప్రాంతంలోని సొరంగాలు, అరుణాచల్ ప్రదేశ్‌లోని సెలా సొరంగం వంటి ప్రాజెక్టులను నిర్మిస్తోంది. రక్షణ, రహదారి అనుసంధానం, విద్యుత్ ఉత్పత్తి వంటి అవసరాల కోసం చైనా భారీ ఆనకట్టలు, రహదారులు, రైల్వే సొరంగాలను నిర్మిస్తోంది. చైనా చేపడుతున్న సిచువాన్-టిబెట్ రైల్వే, భారీ సొరంగాలు, నీటి మళ్లింపు ప్రాజెక్టులు, యార్లుంగ్ సాంగ్పో నదిపై ప్రతిపాదిత మెడాగ్ భారీ ఆనకట్ట వంటి ప్రాజెక్టులు హిమాలయ పర్యావరణ వ్యవస్థపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
జలవిద్యుత్పై ఆధారపడుతున్న నేపాల్ : నేపాల్ ఆర్థిక వ్యవస్థలో జలవిద్యుత్ కీలక పాత్ర పోషిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నేపాల్ విద్యుత్ ఎగుమతుల ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం పొందింది. భారత్, బంగ్లాదేశ్‌కు వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఎగుమతి చేసింది. అయితే ప్రకృతి వైపరీత్యాలు ఈ రంగానికే భారీ నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది. నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలను వరదలు ముంచెత్తడంతో పాటు త్రిశూలి నదీ పరివాహక ప్రాంతంలోని అనేక జలవిద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయి. దీంతో దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో గణనీయమైన భాగం తాత్కాలికంగా దెబ్బతింది. సుమారు 647.4 మిలియన్ డాలర్లతో నిర్మిస్తున్న అప్పర్ త్రిశూలి-1 జలవిద్యుత్ ప్రాజెక్టు నేపాల్ చరిత్రలోని అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకటి. ఇలాంటి భారీ ప్రాజెక్టులు పర్వత ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాల ప్రమాదాలను ఎంతవరకు తట్టుకోగలవన్నది ఇప్పుడు కీలక ప్రశ్న. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, చైనా ఎగుమతి-దిగుమతి బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు నేపాల్‌లోని జలవిద్యుత్, మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాయి. త్రిశూలి, భోటే కోసి నదీ పరివాహక ప్రాంతాల్లో హిమానీనద సరస్సులు ఉప్పొంగడం, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలపై గతంలోనే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ భారీ ప్రాజెక్టులు కొనసాగాయి. సొరంగాల్లో పనిచేస్తున్న కార్మికులు చిక్కుకోవడం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతినడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. వాతావరణ మార్పులకు ప్రభావితమయ్యే దేశాల్లో అనేక ప్రాజెక్టులకు గ్రాంట్ల కంటే రాయితీ రుణాలే ప్రధాన నిధులు. ఫలితంగా ప్రకృతి విపత్తులకు గురైన దేశాలు నష్టాన్ని కాకుండా, తీసుకున్న రుణాల అసలు, వడ్డీని తిరిగి చెల్లించాల్సి వస్తోంది. అంటే వాతావరణ సంక్షోభానికి కారణమైన ప్రపంచ ఉద్గారాల్లో బాధ్యత తక్కువగా ఉన్న పేద దేశాలు, దాని ప్రభావాన్ని ఎదుర్కోవడంతో పాటు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది.
వాతావరణ నిధుల విషయంలో అసమానత : మూడు దశాబ్దాలుగా జరిగిన అనేక అంతర్జాతీయ వాతావరణ సదస్సుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలు, పర్యావరణ సంస్థలు ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన సంపన్న దేశాలే చారిత్రకంగా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు ప్రధాన కారణమని, వాటి ఫలితంగా ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగి హిమానీనదాలు వేగంగా కరుగుతున్నాయని అవి వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు సహాయం చేయడానికి గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఏర్పడింది. సంపన్న దేశాలు ఏటా 100 బిలియన్ డాలర్ల వరకు వాతావరణ నిధులు అందిస్తామని హామీ ఇచ్చాయి. అయితే హామీ ఇచ్చిన మొత్తానికి, వాస్తవంగా అందిన నిధులకు మధ్య భారీ అంతరం ఉందనే విమర్శలూ ఉన్నాయి. నేపాల్‌లో హిమానీనద సరస్సులు ఉప్పొంగి వచ్చే వరదల ప్రమాదాన్ని తగ్గించేందుకు గ్రీన్ క్లైమేట్ ఫండ్ 2017లో 36.1 మిలియన్ డాలర్ల నిధులను ఆమోదించి నప్పటికీ, వాటి అమలులో జాప్యం జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ఇటువంటి ఆలస్యాలు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, పునరావాసం, పర్యావరణ పరిరక్షణ వంటి అత్యవసర చర్యలను బలహీనపరుస్తాయి.
అభివృద్ధి అంటే లాభాలు కాదు : నయా ఉదారవాద అభివృద్ధి నమూనాలో ఆర్థిక వృద్ధి, పెట్టుబడులు, మౌలిక వసతుల విస్తరణ, సహజ వనరుల వెలికితీత, లాభదాయకతను అభివృద్ధికి ప్రధాన ప్రమాణాలుగా పరిగణించారు. కానీ పర్యావరణ నష్టం, ప్రకృతి వైపరీత్యాల ఖర్చును భవిష్యత్తుకు వాయిదా వేయడం వల్ల ఒక కీలక అసమానత ఏర్పడింది. ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆర్థిక లాభాలు కొద్దిమందికి దక్కుతుండగా, పర్యావరణ నష్టం, వరదలు, కొండచరియలు, పునరావాసం, ప్రాణనష్టం వంటి ప్రమాదాల భారాన్ని సమాజం మొత్తం మోయాల్సి వస్తోంది. అంటే లాభాలను ప్రైవేటీకరించి, నష్టాలను సామాజికీకరించే అభివృద్ధి నమూనా దీర్ఘకాలంలో స్థిరంగా నిలబడేది కాదు.
ప్రత్యామ్నాయ అభివృద్ధి అవసరం : నేపాల్‌లోని తాజా వరదలు హిమాలయాల్లో అభివృద్ధి అంటే ఏమిటనే ప్రశ్న అందరినీ కలచివేస్తోంది. దీనికి పరిష్కారం అభివృద్ధిని ఆపేయడం కాదు. హిమాలయ ప్రాంత ప్రజలకు విద్యుత్, రహదారులు, మెరుగైన రవాణా, ఉపాధి, ఆరోగ్యం, విద్య, మెరుగైన జీవన ప్రమాణాలు పొందే హక్కు ఉంది. కానీ ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుంటూ, పర్యావరణానికి అనుకూలంగా, స్థానిక ప్రజల జీవనోపాధికి కేంద్రంగా ఉండాలి. పర్వత ప్రాంతాల్లో ప్రతి ప్రాజెక్టుకు ముందు అక్కడి భౌగోళిక పరిస్థితులు, హిమానీనదాల స్థితి, నదుల సహజ ప్రవాహం, కొండ వాలు స్థిరత్వం, భూకంప ప్రమాదం, వర్షపాతం మార్పులు వంటి అంశాలను సమగ్రంగా అంచనా వేయాలి. హిమాలయాలు కేవలం భారత్, చైనా, నేపాల్లకు చెందిన పర్వత శ్రేణి మాత్రమే కాదు. కోట్లాది ప్రజలకు నీటినందించే, ఆసియాలోని ప్రధాన నదులకు జన్మనిచ్చే కీలక పర్యావరణ వ్యవస్థ. అందువల్ల హిమాలయాల భవిష్యత్తును నిర్ణయించేది ఎంత వేగంగా రహదారులు, ఆనకట్టలు, సొరంగాలు నిర్మించగలమన్నది కాదు… ప్రకృతి సమతుల్యతను కాపాడుకుంటూ ఎంత బాధ్యతాయుతంగా అభివృద్ధి చేయగలమన్నదే ముఖ్యం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు