Homeప్రతిపక్షాలే లక్ష్యం

ప్రతిపక్షాలే లక్ష్యం

- Advertisement -

లోక్‌సభలో రాక్షస బిల్లులు ప్రవేశపెట్టిన అమిత్‌షా

. జేపీసీకి పంపే తీర్మానానికి ఆమోదం
. తీవ్రంగా వ్యతిరేకించిన ‘ఇండియా’ ఎంపీలు
. బిల్లు ప్రతులు చించి… నిరసన
. రాజ్యాంగం, సమాఖ్య వాదానికి వ్యతిరేకమని మండిపాటు
. అధికార`ప్రతిపక్ష సభ్యుల మధ్య తోపులాట

న్యూదిల్లీ: తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉన్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులు తమ పదవిని కోల్పోయేలా కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకొచ్చిన బిల్లులు లోక్‌సభలో తీవ్ర దుమారాన్ని రేపాయి. సంచలన నిబంధనలతో కూడిన ఈ బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బుధవారం సభలో ప్రవేశపెట్టగా, ఇండియా ఐక్య సంఘటన తీవ్రంగా వ్యతిరేకించింది. కనీసం ఐదేళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి, అరెస్టయి, నెల రోజులు కస్టడీలో ఉంటే 31వ రోజున వారి పదవి పోయేలా నిబంధనను చేర్చారు. వారు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం పదవిని కోల్పోతారు. దీనిని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు, జమ్ము కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ (సవరణ) బిల్లులను అమిత్‌ షా సభ ముందుంచారు. ఈ బిల్లులు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులకు వర్తించేలా కొత్త చట్టపరమైన నిబంధనలను ప్రతిపాదిస్తున్నాయి. అమిత్‌ షా లోక్‌సభలో బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంగా ఇండియా ఐక్యసంఘటన ఎంపీల నుంచి నుంచి పెద్దఎత్తున నిరసన వ్యక్తమైంది. కేంద్రం హడావిడిగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగం, సమాఖ్య వాదానికి వ్యతిరేకంగా ఉన్నాయని ముక్తకంఠంతో నిరసించారు. ఒక దశలో ప్రతిపక్ష, అధికార పార్టీ ఎంపీల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. అమిత్‌ షాను కాపాడటానికి కేంద్ర మంత్రులు రవ్నీత్‌ సింగ్‌ బిట్టు, కిరణ్‌ రిజిజు సహా బీజేపీ సభ్యులు రంగంలోకి దిగారు. షా చుట్టూ ముగ్గురు హౌస్‌ మార్షల్స్‌ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సభ వాయిదా పడిన తర్వాత కూడా, ప్రతిపక్ష సభ్యులు బిగ్గరగా నినాదాలు చేస్తూనే ఉన్నారు.
అయితే ఈ బిల్లులను హడావిడిగా తీసుకొచ్చారనే విమర్శలను అమిత్‌ షా తోసిపుచ్చారు. వాటిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపనున్నట్లు ప్రకటించారు. బిల్లులను పార్లమెంటు ఉమ్మడి కమిటీకి పంపుతామని, అక్కడ ప్రతిపక్ష సభ్యులు సహా ఉభయ సభల సభ్యులు తమ సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ మేరకు లోక్‌సభ నుండి 21 మంది, రాజ్యసభ నుండి 10 మంది సభ్యులతో కూడిన పార్లమెంటు ఉమ్మడి కమిటీకి చర్యలను సూచించాలని తీర్మానం ప్రవేశపెట్టగా ఆ తీర్మానానికి వాయిస్‌ ఓటు ద్వారా సభ ఆమోదం తెలిపింది. తదుపరి సమావేశాల మొదటి వారం చివరి రోజు నాటికి కమిటీ తన నివేదికను సభకు సమర్పించాల్సి ఉంటుంది. పార్లమెంటు తదుపరి సమావేశాలు నవంబర్‌ మూడో వారంలో జరిగే అవకాశం ఉంది. అంతకుముందు మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభలో హోంమంత్రి అమిత్‌షా మూడు బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు బిల్లుల ప్రతులను చించిపారేశారు. స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. గుజరాత్‌ హోంమంత్రిగా ఉన్న సమయంలో అమిత్‌ షా అరెస్టయిన అంశాన్ని కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ లేవనెత్తారు. దీన్ని అమిత్‌ షా ఖండిరచారు. అరెస్టుకు ముందే నైతిక కారణాలతో తాను రాజీనామా చేశానని, కోర్టు నిర్దోషిగా ప్రకటించాకే ప్రభుత్వంలో చేరానని చెప్పారు.
తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ నాయకులు రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో కొనసాగడం తగదని అమిత్‌ షా అన్నారు. అయినా ఆ మూడు బిల్లులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ బిల్లులను ప్రవేశపెట్టడాన్ని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది అధికారాల విభజన సూత్రానికి విరుద్ధమని ఆయన అన్నారు. ‘‘ఈ బిల్లుతో కార్యనిర్వాహక సంస్థలే న్యాయమూర్తిగా, జ్యూరీగా, శిక్ష అమలు చేసే వారిగా తయారవుతాయి… వాటికి అపరిమిత అధికారాలు లభిస్తాయి. ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు ఈ నిబంధనలను దుర్వినియోగం చేయవచ్చు’’ అని ఒవైసీ తీవ్రంగా ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారీ కూడా ఈ బిల్లులు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. ‘‘నిరపరాధి అని నిరూపించుకునే వరకు ఎవరైనా నిర్దోషే అనేది మన చట్టబద్ధమైన పాలనలోని ప్రాథమిక సూత్రం. కానీ ఈ బిల్లు ఆ సూత్రాన్నే మార్చేలా ఉంది. ఇది ఒక కార్యనిర్వాహక అధికారిని ప్రధానమంత్రి కంటే ఉన్నత స్థానంలో నిలబెడుతుంది’’ అని ఆయన లోక్‌సభలో అన్నారు. స్పీకర్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా సభ్యులు పట్టించుకోలేదు. దాంతో సభను ముందుగా మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో సాయంత్రం 5 గంటల వరకు వాయిదా వేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు