బ్రిటిషర్ల కంటే బీజేపీతోనే ఎక్కువ ప్రమాదం
. మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు కలిసి పోరాడుదాం
. సీపీఐ ఖమ్మం బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి
ఖమ్మం నుంచి ఏబీ కూన
కమ్యూనిస్టులు పోరాటాలు చేస్తారు… కాంగ్రెస్ వాటికి అను గుణంగా శాసనాలు రూపొందిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘మీరు పోరాడతారు…మేం అమలు చేస్తాం. కమ్యూనిస్టుల పోరా టాలకు కాంగ్రెస్ చట్ట రూపం ఇచ్చిం ది’ అని ఆయన అన్నారు. కమ్యూనిస్టు మిత్రులను స్ఫూర్తిగా తీసుకొని గత అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడి… పాశవికంగా వ్యవహరించిన ప్రభుత్వాలను పడగొట్టామని అన్నారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న పాశవిక శక్తులను ఓడించడానికి ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరముందన్నారు. సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాలు ఖమ్మంలో ఘనంగా జరిగాయి. ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, సీపీఐ అగ్రనేతలు హాజరయ్యారు. ‘రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికి, పేదల హక్కులు కొల్లగొట్టడానికి బీజేపీ 400 సీట్లు అడిగింది. కానీ, రాహుల్ గాంధీ, కమ్యూనిస్టులు ప్రజల దగ్గరకు వెళ్లి చెప్పడంతో… 240 సీట్ల వద్దే ఆ పార్టీ ఆగింది. రాజ్యాంగాన్ని దెబ్బ తీసేందుకు మళ్లీ ఎస్ఐఆర్ తీసుకొచ్చారు. ఎస్ఐఆర్ ద్వారా పేదల ఓటు హక్కును కేంద్రం రద్దు చేస్తోంది. ఎస్ఐఆర్ వల్ల పేదలు ఓటు హక్కు కోల్పోతున్నారు. పేదలకు ఓటు హక్కు ఉండడం సావర్కర్ అనుయాయులకు ఇష్టం లేదు. మోదీకి వ్యతిరేకంగా కలిసి పోరాడదాం’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్రంలోని ఫాసిస్టు మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని రేవంత్‌రెడ్డి కమ్యూనిస్ట్టు శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శత వసంతోత్సవ ముగింపు సందర్భంగా ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగిన భారీ బహిరంగసభకు రేవంత్‌రెడ్డి విశిష్ట అతిథిగా హాజరై… సీపీఐ కార్యకర్తలకు వందేళ్ల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తూ మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఎర్రజెండాను నిలబెట్టి పోరాడుతున్న కామ్రేడ్ల త్యాగనిరతి అనిర్వచనీయమని అన్నారు. 1925 డిసెంబరు 26న కాన్పూర్‌లో ఆవిర్భవించి… వందేళ్లుగా ఆదివాసీ, దళిత, పేద, బడుగుబలహీనవర్గాల కోసం నిరంతరం కొట్లాడుతున్న ఎర్రజెండా బిడ్డలు అవసరమైతే తుదిశ్వాస వదులుకుంటామని, ఎర్రజెండాను మాత్రం వదలమనే ప్రతిజ్ఞబూని పనిచేయడం గొప్ప విషయమన్నారు. రవి అస్తమించని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన రెండేరెండు పెద్ద పార్టీలు కాంగ్రెస్, సీపీఐ మాత్రమేనని, కాంగ్రెస్‌కు 140 ఏళ్లు, సీపీఐకి 100 ఏళ్లు నిండాయని, ఈ రెండూ పోరాడితేనే దేశానికి విముక్తి లభించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. దున్నేవాడికి భూమి అనేది ఎర్రజెండా సోదరుల నినాదమేనని, దాని ఫలితమే ఇందిరమ్మ, పీవీ, బూర్గుల సారథ్యంలో సాగిన జమీందార్లు, జాగీర్దార్ల భూముల పంపిణీ కార్యక్రమమని గుర్తుచేశారు. రైతు కూలీలు దొరల గడీల దగ్గర వెట్టిచాకిరీని ఎదిరిస్తూ 8 గంటల పనివేతనం కోసం కమ్యూనిస్టులు చేసిన పోరాటం కారణంగానే కాంగ్రెస్ కనీస వేతన చ{్టం తీసుకువచ్చిందన్నారు. పంట అమ్మడానికి రైతులకు నిర్ణయాధికారం లేని రోజుల్లో కనీస ధర కోసం సీపీఐ చేసిన ఉద్యమాల ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ ఆనాడు కనీస మద్దతుధర కల్పించిందని చెప్పారు. నిజాం నవాబు, రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటానికి సారథ్యం వహించిన సీపీఐ 4 వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నదని, ఆ తర్వాత నెహ్రూ, పటేల్ జోక్యంతో నిజాంను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ ప్రాంతానికి దక్కిందంటే చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావులు సాగించిన పోరాట ఫలితమేనని అన్నారు. నాడు ప్రజలను పీడించిన బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టులు ఈనాడు బ్రిటిష్‌వారి విభజించు`పాలించు తరహా సిద్ధాంతంతో దేశాన్ని పాలిస్తున్న బీజేపీని తరిమికొట్టాల్సిన తరుణం వచ్చిందని కోరారు. బీజేపీ అంటేనే బ్రిటిష్ జనతా పార్టీ అని వ్యాఖ్యానించారు. వలసను అడ్డుకునేలా యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ చ{్టం తీసుకువస్తే… అదానీ, అంబానీలకు కూలీలను అప్పగించడం కోసం ఆ చట్టాన్ని రద్దుచేసిన ఎన్డీఏ ప్రభుత్వ చర్య వెనుక బలమైన కుట్ర దాగివుందన్నారు. కరోనా కాలంలో నరేగా చట్టం ప్రజల ఆకలిదప్ప్పులు తీర్చిందని, అలాంటి గొప్ప చట్టాన్ని కార్పొరేట్ కంపెనీల కోసం రద్దు చేయడం క్రూరమైన చర్యగా రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. 400 సీట్లు దక్కితే రాజ్యాంగాన్ని సమూýంగా మార్చేయాలన్న దుర్బుద్ధిని ఇండియా ఐక్యసంఘటన అడ్డుకుందని, అందుకే ఇప్ప్పుడు పరోక్షంగా రాజ్యాంగాన్ని మార్చేసి… పేదల హక్కులు కాలరాయడానికి బీజేపీ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందన్నారు. ఎన్నోఏళ్లుగా తండాల్లో జీవనం సాగిస్తున్న ఆదివాసీల హక్కులను లాగేసుకోవడానికి, వారి ఓటు హక్కును రద్దుచేయడానికే ఎస్ఐఆర్ను బలవంతంగా అమలు చేస్తున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వారైనా, కమ్యూనిస్టులైనా, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వారెవరైనా బీజేపీకి వ్యతిరేకంగా దండుకట్టాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులు ప్రజల కోసం కొట్లాడిన ప్రతిసారీ ఆ సమస్యలపై శాసనాలు తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్‌పార్టీకి ఉందన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో పేదల ప్రభుత్వం నడుస్తున్నదన్నారు. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుల కంచుకోటగా ఉందంటే… అది వారి ఉద్యమాల ఫలితమేనని కొనియాడారు. ఖమ్మంలో కమ్యూనిస్టులు ఉండగా, బీజేపీ ఇక్కడ రెండు సర్పంచ్ పదవులను కూడా గెలవలేదని అన్నారు. ఫాసిస్టు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కలసి పోరాడాలని రేవంత్‌రెడ్డి హర్షధ్వానాల నడుమ సీపీఐ శ్రేణులను కోరారు.


