. ప్రతి మూడు నెలలకు సామూహిక గృహప్రవేశాలు
. వచ్చే ఉగాదికి 5 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు
. సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రానున్న మూడేళ్ల కాలంలో 17 లక్షల ఇళ్లను నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలని టిడ్కో, గృహ నిర్మాణ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రతి మూడు నెలలకోసారి లక్ష్యానికి అనుగుణంగా సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టాలని స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో టిడ్కో, గృహ నిర్మాణ శాఖపై సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ ‘అందరికీ ఇళ్లు’ అని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. ఈ హామీని నెరవేర్చే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాం. ఇది ఇక్కడితో ఆగకూడదు… మరింత వేగంగా వెళ్లాలి. ఇప్పటి నుంచే లక్ష్యాలు పెట్టుకుని హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని 2029 జనవరి నాటికి పూర్తి చేయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారుగా 20 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేసుకున్నాం. ఇక మిగిలిన 17 లక్షల ఇళ్లు వచ్చే మూడేళ్లలో పూర్తవ్వాలి. ప్రతి మూడు నెలలకోసారి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం చేపట్టాలి. వచ్చే ఉగాది నాటికి 5 లక్షల ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలు జరగాలి. హౌసింగ్ ఫర్ ఆల్ అనే కార్యక్రమాన్ని ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి ఉద్యోగులు అందరూ బాధ్యతగా తీసుకోవాలి. త్వరలో టిడ్కో, హౌసింగ్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, ఉద్యోగులందరితోనూ సమీక్ష చేస్తాను’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
ప్రజలు తృప్తి చెందితేనే నాకు సంతృప్తి
ప్రజలు తృప్తి చెందితేనే తనకు సంతృప్తి అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘గృహ నిర్మాణాల్లో భాగంగా ఎవరైనా స్థలం కావాలని అడిగితే స్థలం ఇవ్వండి. అలాగే తమకు స్థలాలు ఉన్నాయని లబ్ధిదారులు చెబితే వాళ్లకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వండి. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రతి అప్డేట్ ఆన్ లైన్‌లో ఉండేలా చూడాలి. ఇక ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించే విధంగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టేలా చూడాలి. పీఎంఏవై 1.0 హౌసింగ్ స్కీములోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీవీటీజీ వంటి సామాజిక వర్గాలకు అదనంగా చెల్లిపులు జరుపుతున్నాం. ఇప్పుడు ముస్లిం మైనార్టీలకూ అదనంగా రూ.50 వేలు చెల్లిస్తాం. దీని కోసం 18 వేల ముస్లిం మైనార్టీ లబ్ధిదారులకు రూ.90 కోట్లు అవసరమవుతాయి. మనం ఆయా వర్గాలకు చేకూరుస్తోన్న అదనపు సాయాన్ని వారికి వివరించాలి’ అని తెలిపారు.
నరేగా తరహాలో…
గత ప్రభుత్వ కక్ష సాధింపులో భాగంగా 2014-2019 మధ్య చేపట్టిన ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకానికి సంబంధించిన కొందరు లబ్ధిదారులకు బిల్లులు రాకుండా చేసిందని సీఎం అన్నారు. దీని వల్ల రూ.920 కోట్ల మేర బిల్లులు పెండిరగులో ఉన్నాయని చెప్పారు. ఈ బిల్లులను మళ్లీ రప్పించేలా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని, ఆ బిల్లులను గత ప్రభుత్వం ఏ విధంగా అడ్డుకుందో వివరించాలని అధికారులను ఆదేశించారు. 2014-19 మధ్య కాలంలో జరిగిన నరేగా పనులకు సంబంధించిన బిల్లులను గత ప్రభుత్వం ఇదే తరహాలో ఆపేసిందన్నారు. అయితే ఆ బిల్లులను మళ్లీ స్ట్రీమ్ లైనులో పెట్టి బిల్లులను వచ్చేలా చేశామని ఆయన తెలిపారు. అదే తరహాలో ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీంకు సంబంధించి పెండిరగు బిల్లులను రప్పించేలా కృషి చేయాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో మంత్రి కొలుసు పార్ధసారధి, టిడ్కో, హౌసింగ్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


