Homeమోదీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపైదేశవ్యాప్త ప్రచారోద్యమం

మోదీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపైదేశవ్యాప్త ప్రచారోద్యమం

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: మరో వంద సంవత్సరాలకు స్ఫూర్తినిచ్చేలా సీపీఐ శతవార్షికోత్సవాల ముగింపు వేడుకలు ఖమ్మంలో జరిగాయని పార్టీ జాతీయ కార్యదర్శి కే రామకష్ణ పేర్కొన్నారు. గురువారం విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముగింపు వేడుకలపై ఆయన మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, జాతీయ కార్యవర్గసభ్యులు రావుల వెంకయ్య, ఏపీ కంట్రోల్ కమిషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ పాల్గొన్న ఈ సమావేశంలో రామకష్ణ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో కార్మికులు, రైతులు, కష్టజీవులు, మహిళలు, విద్యార్ధులు శతవార్షికోత్సవ ముగింపు సభలో పాల్గొన్నారని… మరో వంద సంవత్సరాలకు స్ఫూర్తినిచ్చేలా సభ జరిగిందన్నారు. ర్యాలీని జయప్రదం చేసిన కమ్యూనిస్టు శ్రేణులు, రెండు రాష్ట్రాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలకు భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి తరపున విప్లవాభినందనలు తెలియజేశారు. పార్టీ జాతీయ సమితి సమావేశాలు కూడా ఈ నెల 20,21 తేదీల్లో ఖమ్మంలో జరిగాయని తెలిపారు. దేశంలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టుల ముందు ఉన్న కర్తవ్యం అనే అంశంపై జాతీయస్థాయి సెమినార్ జరిగిందని… సీపీఎం ప్రధానకార్యదర్శి ఎం.ఏ.బేబి, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేవరాజన్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారన్నారు. సదస్సులో ప్రధానంగా ప్రపంచ, దేశ వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చాలా సీరియస్‌గా, లోతుగా చర్చించామన్నారు. ప్రపంచంలో ఒక రకమైన భయోత్పాతం సష్టించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందరినీ బెదిరిస్తున్నారన్నారు. గతంలోనూ సామ్రాజ్యవాదుల దుశ్చర్యలు చూసినప్పటికీ ఈరోజు మరింత బరితిగించి వెనిజులా అధ్యక్షుడిని, అతని భార్యను కూడా కిడ్నాప్ చేసి అమెరికా తీసుకొచ్చి జైలులో పెట్టి… అక్కడి చట్టాల ప్రకారం వారిని ప్రాసిక్యూషన్ చేస్తానని చెబుతున్నాడంటే పరిస్థితులు ఏ విధంగా మారోయో అర్థం చేసుకోవచ్చ న్నారు. చివరకు నాటో కూటమి దేశాలను కూడా బెదిరించే స్థాయికి ట్రంప్ దిగజారారని రామకష్ణ మండిపడ్డారు. ట్రంప్ చర్యలను ప్రధాని మోదీ కనీసం ఖండించలేని పరిస్థితిలో ఉన్నారని ఆక్షేపించారు. ఇండియా`పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపింది తానేనని ట్రంప్ పదేపదే చెబుతున్నా…పార్లమెంట్‌లో గంటన్నర ఉపన్యాసం ఇచ్చిన మోదీ… ఆ అంశంపై ఒక్క మాట మాట్లాడలేదన్నారు. రష్యా వద్ద ముడి చమురు కొనుగోలు చేయకూడదని భారత్‌ను బెదిరించడానికి ట్రంప్‌కు ఏమి హక్కు ఉందని ప్రశ్నించారు. వీసా నిబంధనలు మార్చి అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థులకు ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. ట్రంప్ దురాగతాలపై మాట్లాడలేని దుస్థితిలో మోదీ నేతత్వంలోని భారత ప్రభుత్వం ఉందన్నారు. ఈ అంశాలతోపాటు దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్ధిక, సామాజిక పరిస్థితులపై జాతీయ కౌన్సిల్‌లో చర్చించి తొమ్మిది తీర్మానాలు ఆమోదించినట్లు రామకష్ణ తెలిపారు. రూపాయి విలువ పతనంపై ప్రధాని మోదీ సిగ్గుపడాలన్నారు. ఒక డాలర్ మారకం విలువ రూ.91.64 పైసలకు వచ్చిందన్నారు. గతంలో మన్మోహన్ సింగ్ హయాంలో డాలర్ మారకం విలువ రూ.60లు ఉన్నప్పుడు విమర్శలు గుప్పించిన బీజేపీ, ఆరఎసఎస్ నేతలు ఇప్పుడు ఎటుపొయ్యారంటూ మండిపడ్డారు. మరోవైపు మోదీ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేస్తూ కార్పోరేట్‌లను పెంచిపోషిస్తోందని విమర్శించారు. ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేస్తున్నారని… బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్‌లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడు, కర్నాటక, కేరళలో గవర్నర్ల తీరును తప్పుబట్టారు. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో గవర్నర్‌లు పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ అధినేతను కించపరుస్తున్నారని… వీటన్నింటిపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. వీటన్నింటిపై కౌన్సిల్ సమావేశంలో చర్చించి దేశ వ్యాప్తంగా ప్రజా చైతన్య కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ మైనార్టీలకు రిజర్వేషన్‌లను ప్రైవేటు రంగంలోనూ కల్పించాలని తీర్మానాన్ని ఆమోదించడం జరిగిందన్నారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఒక పెద్ద ప్రచార జాతాను ముందుకు తీసుకువస్తున్నామన్నారు. అదే విధంగా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, లౌకిక వాదాన్ని, ప్రజాతంత్ర వాదాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నామని, ప్రభుత్వ అనుకూల కార్పొరేట్ విధానాలను ఎండగట్టి ప్రజలను చైతన్య పర్చడానికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ మొదటి సారిగా ఈ ప్రచార ఆందోళన కార్యక్రమం చేపడుతున్నామని, దీనికి అందరూ ముందుకు రావాలని కోరారు.
భూముల ధారాదత్తంపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఈశ్వరయ్య డిమాండ్
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య మాట్లాడుతూ జనవరి 26న రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ పతాకాలను ఆవిష్కరించడంతో పాటు ప్రతి మండల కేంద్రంలో సీపీఐ నేతత్వంలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి…ప్రజాస్వామ్య లౌకిక వ్యవస్థను రక్షించుకోవాలనే డిమాండ్‌తో ప్రతిజ్ఞకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పెద్ద ఎత్తున ట్యాంపరింగ్ చేయాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ఇస్తానని నిత్యం ప్రకటిస్తున్నారని… ఇది సరైంది కాదని, బేషజాలకు పోవాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్‌జీవో ఆర్గనైజేషన్‌లు వివిధ దేశాల్లో అధ్యయనం చేసి పీపీపీ అనేది ఎక్కడా విజయవంతం కాలేదని నివేదికలు ఇస్తుంటే కేవలం రాజకీయ కోణంలోనే చంద్రబాబు ఆలోచిస్తున్నారని… దీని వల్ల సమాజంపై పడే ప్రభావం గురించి ఆలోచించడం లేదన్నారు. మెడికల్ కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే నడిపించాలని మరో సారి డిమాండ్ చేశారు. లోకేశ్ ఇటీవల 99 పైసలకే భూములు ఇస్తామని మాట్లాడుతున్నారని, ఇది కరెక్టు కాదన్నారు. ఎవరి భూములు ఎవరికి దానం చేస్తున్నారని ప్రశ్నించారు. పారిశ్రామిక వర్గాలన్నింటికీ ఇష్టానుసారంగా భూములు ఇస్తామంటే ఇది ఎవరి జాగీరు కాదు అని లోకేశ్ గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ రెండేళ్ల కాలంలో ఎన్ని లక్షల ఎకరాలు సమీకరించారు ? ఎన్ని వేల ఎకరాలు కార్పోరేట్ కంపెనీలకు అప్పగించారు ? ఆ కార్పోరేట్ కంపెనీలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది ? ఎంత ఉత్పత్తిని పెంచింది ? దాని ద్వారా ప్రజలకు పెరిగిన జీవన ప్రమాణాల ఆదాయం ఏమిటీ ? అనే అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు