. రూ.901 కోట్ల తక్షణ సాయం
. కేంద్ర బృందాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం
. 6 జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన
విశాలాంధ్ర – సచివాలయం: మొంథా తుపాను రాష్ట్రంలో అంచనాలకు మించి అపార నష్టం కలిగించిందని, కేంద్ర ప్రభుత్వం ఉదారత చూపి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కోరింది. మొంథా తుపాను వల్ల రూ.6384 కోట్ల నష్టం వాటిల్లిందని, రూ.901.4 కోట్లు తక్షణ సాయం చేసి ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తుపాన్ వల్ల వాటిల్లిన నష్టం మదింపు వేయడానికి కేంద్ర బృందం సోమవారం రాష్ట్రానికి వచ్చింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పాసుమీబసు, కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె. పొన్నుస్వామి నేతృత్వంలోని 8 మంది సభ్యుల కేంద్ర బృందం ముందుగా అమరావతిలోని సచివాలయానికి వచ్చింది. ఆర్టీజీఎస్ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం తుపాను నష్టం గురించి రెవెన్యూ శాఖ చీఫ్ కమిషనర్ జి.జయలక్ష్మీ , ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్లు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. తుపాను 24 జిల్లాల్లో విధ్వంసం సృష్టించిందని… వ్యవసాయరంగానిక తీవ్ర నష్టం కలిగించిందని తెలిపారు. 1.61 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మినుము, మొక్కజొన్న పంటలు, 6,250 హెక్టార్లలో ఉద్యాన పంటలు , 17.72 హెక్టార్లలో మల్బరీ తోటలు దెబ్బతిన్నట్లు వివరించారు. 3063 హెక్టార్లలో చేపల చెరువులు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. 4,566 ఇళ్లు దెబ్బతిన్నాయని, 1853 పాఠశాల భవనాలకు కూడా నష్టం వాటిల్లిందని వెల్లడిరచారు. ఆర్ అండ్ బీ శాఖకు సంబంధించి 4,794 కిలోమీటర్ల రోడ్లు, 311 వంతెనలు, కల్వర్టులు, జలవనరుల శాఖకు సంబంధించి 3437 మైనర్ ఇరిగేషన్ పనులు, 2417 మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లిందన్నారు. తుపాను కలిగించిన విధ్వంసం నుంచి బాధితులు కోలుకోవడానికి కేంద్ర ఉదారంగా వ్యవహరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తుపాను ఎదుర్కోవడానికి ఎంతో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించడం వల్ల పెద్దగా ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగామని అధికారులు సంబంధిత చర్యల్ని వివరించారు. కేంద్ర బృందం రెండు జట్లుగా విడిపోయి కాకినాడ సహా ఏలూరు, కృష్ణా, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో పర్యటించింది. తుపాను నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించింది. కేంద్ర అధికారులు జిల్లా అధికారులతో మాట్లాడటంతోపాటు ప్రభావిత కుటుంబాలతో కూడా నేరుగా ముఖాముఖి నిర్వహించారు. ఈ తుపాను ప్రభావం, నష్టం స్థాయిని అంచనా వేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక, పునరావాస చర్యలను సమీక్షించి… కేంద్ర సహాయం కోసం తమ నివేదికను రూపొందించనున్నారు. కాకినాడ జిల్లాలోని సూరదాపేట గ్రామంలో ఎగిసిపడిన అలల వల్ల దెబ్బతిన్న ఇళ్లను బృందం పరిశీలించింది. కృష్ణా జిల్లా గన్నవరం ఎంపీడీవో కార్యాలయం మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన పంట నష్టాల ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. రైతులతో కూడా కేంద్ర బృందం ముఖాముఖి మాట్లాడి వాస్తవ స్థితిగతులను తెలుసుకున్నారు.


